సూత్రధారోక్తి
ఆకర్ణించి సూత్రధారుఁడు “హా! యే నెఱింగితి, నేకశిలానగరంబునం దార్యవాటంబునం గామమంజరి యను పునర్భువునందు బద్ధాను రాగుం డై, కార్యాంతరవ్యాసంగంబునం దేశాంతరగతుం డైన, కాసల్నాటి గోవింద మంచనశర్మ నుద్దేశించి, యమ్ముద్దియ పుత్తెంచిన యసంబంధీభూతప్రేమసంధుక్షణాగర్భం బైన మదనలేఖ సందేశపద్ధతి యది; పఠియించుచున్నవాఁ డతని కట్టనుంగుఁ జెలికాడు టిట్టిభసెట్టి గావలయు, నయ్యిరువురు నాబాల్యమిత్రంబులు. వీరి యోగక్షేమంబు లనుసంధించెదం గాక” యని నిష్క్రాంతుం డయ్యె.
ఇది ప్రస్తావన