పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసంగాలు

55

'ఉన్నది' ని భవిష్యత్తు తోనే కాకుండా, జరిగిపోయిన గతంతో కూడా పోల్చిచూడకుండా వుండటం- దీనికి బ్రహ్మాండమైన సావధాన శీలత్వం అత్యావశ్యకం అవుతుంది. మీకు అర్థమైందా? నిన్న నాకు కొంత సుఖం లభించింది- యింద్రియాను భూతమైన సుఖం; అసాధారణమైన వెలుగును ప్రసరించిన ఒక భావం; కాంతితో పూర్తిగా నిండిపోయిన ఒక మేఘాన్ని నిన్న చూశాను; కానీ యివాళ దాన్ని నేను చూడలేక పోతున్నాను- అదీ నాకు మళ్ళీ కావాలి. కాబట్టి వర్తమానాన్ని, ఒకప్పుడు జరిగిన దానితో పోలుస్తాను. ఇకముందు ఎట్లా వుండాలి అన్నదానితో వర్తమానాన్ని పోల్చిచూడాలనుకుంటాను. ఈ పోల్చిచూడటం ద్వారా విలువగట్టడం అనేదాని నుంచి విముక్తం చెందాలంటే అఖండమైన తెలివితేటలు, సున్నితశీలత్వం అవసరం. తెలివి, సున్నితత్వం సంపూర్ణంగా వుండి తీరాలి. అప్పుడే 'వున్నది' ని అవగాహన చేసుకోగలుగుతారు. అప్పుడు మీలో గాఢోద్వేగం వున్నదని గ్రహిస్తారు. 'ఉన్నది' ని అందుకోవడానికి మీకు శక్తి వుంటుంది. అయితే 'వున్నది' ని 'జరిగినదాని' తోనూ, 'ఉండవలసినదానీ' తోనూ మీరు పోల్చి చూస్తుంటే ఆ శక్తిని మీరు పోగొట్టుకుంటారు.

సరే, యింతవరకు స్పష్టంగా వుందని ఆశిస్తాను. మేధాపరంగా కాదు, ఎందుకంటే దానివల్ల ఏమాత్రం లోభం వుండదు. అంతకంటే మీరు లేచి బయటకు వెళ్ళి పోవడం మంచిది. అయితే, నిజంగానే యిది మీకు అవగాహన అవుతే, అప్పుడు సుఖం వైపు సూటిగా చూడగలుగుతారు. అప్పుడు నిన్న పొందిన సుఖంతో దీనిని పోల్చిచూడరు. రేపు పొందబోయే సుఖంతో కూడా పోల్చిచూడరు. సుఖంకోసం వెతుక్కుంటున్న ఆ అసలు మనసును మీరు పరీక్షిస్తారు. సుఖం గురించిన యీ సూత్రాన్ని మనిషి అర్థం చేసుకోవాలి తప్ప, 'నాకు సుఖం కావాలి' అనకూడదు. మీకు సుఖం కావాలంటే బాధను కూడా స్వీకరించాలి. దానితో పాటు దుఃఖాన్ని కూడా, ఒకటి లేకుండా రెండోది పొందడానికి వీల్లేదు. ఏ రూపంలో వున్న సుఖాన్నయినా సరే వెతుక్కుంటున్నప్పుడు సంఘర్షణలతో కూడిన ప్రపంచాన్ని మీరు తయారు చేస్తున్నారు. 'నేను ఒక హిందువుని' అని మీరు అంటే- మనం తగిలించుకునే యితర పేర్ల చీటీలు కూడా మీకు తెలుసు. మీకు గొప్ప ప్రాముఖ్యం వున్నట్లు మీకు అనిపిస్తుంది. ఒక నదిని పూజిస్తుంటే తక్కిన నదులన్నింటినీ మీరు తృణీకరించినట్లుగా ఒక కుటుంబానికి చాలా గొప్ప ప్రాముఖ్యత వచ్చిందంటే తక్కిన కుటుంబాలన్నింటినీ తృణీకరించినట్లే. అందుకే కుటుంబాలే విపత్తులకు కారణం అవుతున్నాయి. ఒక వృక్షాన్నో, ఒక దేవుడినో మీరు పూజిస్తే తక్కిన వృక్షాలన్నింటినీ, దేవుళ్ళందరినీ తృణీకరించినట్లే లెక్క. ప్రస్తుతం అదే జరుగుతున్నది. మీ స్వంత, ప్రత్యేకమైన చిన్ని దేశాన్ని మీరు పూజిస్తుంటే, తక్కిన దేశాలన్నింటినీ మీరు తృణీకరించినట్లే.