Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

కృష్ణమూర్తి తత్వం

బ్రహ్మాండమైన సామర్థ్యాన్ని, బ్రహ్మాండమైన సజీవత్వాన్ని పొందుతుంది. ఎందుకంటే అప్పుడది “వున్నది' ఏమిటి అన్నదానిని చూస్తుంటుంది కాబట్టి.

చూడండి, సర్! నేను ఒక డొల్ల మనిషిని. చాలా లోతైన స్వభావం, శక్తి సామర్ధ్యాలు, ప్రగాఢమైన ఆలోచనా శక్తీ, జీవన విధానమూ వున్నాయని పేరుపడిన ఒక వ్యక్తితో నన్ను పోల్చి చూసుకుంటాను. నేను డొల్ల మనిషిని, సంకుచిత బుద్ధి కలవాడిని, అల్పుడిని కాబట్టి ఆ వ్యక్తితో నన్ను నేను పోల్చుకుంటాను. అతనిలాగా వుండాలని అవస్థ పడతాను. అతనిలాగా వుండటం కోసం అతన్ని అనుకరిస్తాను, అతని మాటలు వుదహరిస్తూ వుంటాను, అతన్ని అనుసరిస్తాను. ఆ విధంగా నన్ను నేనే ధ్వంసం చేసుకుంటాను. ఈ ఘర్షణ అంతులేకుండా కొనసాగిపోతూనే వుంటుంది. అయితే, పోల్చిచూడటం అన్నది అసలు లేనేలేకపోతే నేను మందబుద్ధిని ఆని నాకు ఎట్లా తెలుస్తుంది? మీరు అన్నారు కాబట్టా? నేను ఒక వుద్యోగం సంపాదించుకోలేక పోయాను కనుకనో? పొరశాలలో సరిగ్గా చదువుకోలేదు కనుకనో? అసలు పోల్చి చూడటమే లేకుండాపోతే నేనొక మందబుద్ధిని అని నాకు అనిపిస్తుందా? అందువల్ల, నేను ఏమిటో అదే నేను. నేను ఒక స్థితిలో వున్నాను, అక్కడ నుండి కదలగలను, కొత్తవి కనిపెట్టగలను, మార్పు చెందగలను. కాని, మరొకరితో నన్ను నేను పోల్చు కుంటున్నప్పుడు జరిగే మార్పు మాత్రం పూర్తిగా కృత్రిమమైనది. దయచేసి యిదంతా శ్రద్ధగా వినండి, యిది మీ జీవితం. అంటే, పోల్చిచూడటం లేనప్పుడు 'వున్నది' వుంటుంది. అక్కడి నుంచి నేను కదులుతాను. జీవితంలోని ప్రాధమిక సూత్రాల్లో యిది ఒకటి. ఆధునిక జీవితం మనిషిని పోల్చిచూడటం, పోటీలు పడటం, అంతులేని పోరాటాలలో, యితరులతో కలహాలలో చిక్కుకొని పోవడం అనే నిబద్ధీకరణానికి లోను చేసింది. పోల్చిచూడటం లేనప్పుడే 'వున్నది' ని నేను చూడగలుతాను. కాబట్టి, పోల్చి చూడటం అన్నది వట్టి కుర్రతనపు వ్యవహారమని, అపరిపక్వతను సూచిస్తుందని నేను, మాటల్లోనే కాదు, యదార్ధంగానే అర్ధంచేసుకుంటాను.

సర్! ప్రేమ వున్న చోట పోల్చిచూడటం వుంటుందా? ఒకరిని మీరు మీ హృదయంతో, మీ మనసుతో, మీ శరీరంతో, మీ సంపూర్ణ అస్తిత్వంతో ప్రేమించి నప్పుడు, వారిని సొంతం చేసుకోవడం కాదు, వారిపై పెత్తనం చలాయించడం కాదు 'ఇదినాది' అనడం కాదు; అప్పుడు పోల్చి చూడటం అనేది వుంటుందా? పోల్చి చూడటం లేనప్పుడు మాత్రమే 'వున్నది' ని మీరు చూడగలుగుతారు. ఇది కనుక మనం అర్ధం చేసుకుంటే, అప్పుడు సుఖం యొక్క సమస్త స్వరూపం ఏమిటో తెలుసుకోవడం, తరచి శోధించడం మనం ఆరంభించవచ్చు.