Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

కృష్ణమూర్తి తత్వం

అప్పుడు మీరు కలహానికి తయారుగా వుంటారు; యుద్ధం చేయడానికీ, ఒకరి నొకరు చంపుకోడానికీ కూడా.

కాబట్టి సుఖం, దేవుళ్ళని పూజించడంలో, సత్యాన్ని అన్వేషించడంలో, 'నా దేశం', 'నా కుటుంబం', 'నా హోదా' అని అనడంలో కూరుకొనిపోయివుంది. వీటన్నింటిలోను కలిసిపోయివున్నది సుఖమే, ఈ సుఖమే చెప్పశక్యంకాని విపరీతాలను సృష్టిస్తున్నది. ఇది మనం అర్థం చేసుకోవాలి. తృణీకరించకూడదు. ఎందుకంటే, తృణీకరించిన క్షణంలోనే మీ చేతిని మీరే కత్తిరించి వేసుకున్నట్లవుతుంది, మీ కళ్ళను మీరే పొడుచుకున్నట్లవుతుంది. ఆ పైన అందమైన మేఘాన్నికాని, సుందరమైన స్త్రీనికానీ, చక్కని వృక్షాన్నికాని చూసే సుఖం లేకుండా చేసుకోవడం లాంటిది. కాబట్టి, సుఖం యొక్క అసాధారణమైన ప్రాముఖ్యాన్ని, సుఖం ఎట్లా కలుగుతుందో అన్నదానిని మనం అర్ధం చేసుకోపోలి, అది అర్ధం చేసుకున్నప్పుడు, సుఖం యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకుంటారు. అదేమిటో యిప్పుడు మనం చూద్దాం.

చూడండి, ప్రపంచంలోని మతాలన్నీ మీరు కోరికలు వుండకూడదని చెప్పాయి. ఆధ్యాత్మికులనబడే వారి సూక్తుల్లో ఒకటి ఏమిటంటే, కోరికలు లేకుండా వుండటానికి, నిష్కామంగా వుండటానికీ మీరు శతవిధాలా ప్రయత్నించాలి అని. అదంతా వట్టి మూర్ఖత్వం. ఎందుకంటే, ఏదయినా ఒకటి చూసీ చూసేలోపలే కోరిక మనలో కలుగుతుంది. కోరిక అనేది ఒక ప్రతిచర్య. ప్రకాశవంతమైన ఒక రంగుని చూసినప్పుడు, దానివైపు బాగా పరికించి చూడండి. మీకు తెలుసా, మహా సొందర్యవంతమైన వాటిలో రంగు ఒకటి. రంగు అంటే దైవం. దానివైపు చూడండి. 'నాకు ఎరుపు అంటే యిష్టం' అని కాని, 'నీలం యిష్టం' అని కాని అనకండీ, ఊరికే మేఘాల రంగుని గమనించండి. చీరె రంగుని, వసంతకాలంలో అప్పుడే చిగురించిన ఆకుల వర్ణాన్ని చూడండి. అట్లా చూసినప్పుడు, అందులో సుఖం ఏమీ లేదని, కేవలం సౌందర్యం మాత్రమే వున్నదనీ కని పెడతారు. సౌందర్యం ప్రేమ లాగానే కోరిక కాదు, సుఖమూ కాదు.

ఇప్పుడు యీ కోరిక అనే సమస్య సమస్తాన్నీ అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. నిజంగా చూస్తే యిది చాలా సరళంగా వుంటుంది. దీనిని గురించి మనుష్యులు ఎందుకంత గలభా చేస్తారో నాకు తెలియదు. అది ఎట్లా వూపిరి పోసుకుంటుందో మీరే చూడచ్చు. మొదట పరికించడం, ఆ తరువాత యింద్రియానుభూతి, పరిచయం, కోరుకోవడం. అంతే, అంతకంటే ఏమీ లేదు. ఇక సమస్య యిప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు ఆలోచన ప్రవేశించి, ఆ కోరికను గురించి తలపోస్తుంది. అదే సుఖంగా తయారవుతుంది. అంటే ఏమిటంటే- సర్! పెద్ద, లోతైన లోయలు వున్న ఒక అందమైన పర్వతాన్ని నేను చూస్తాను. మంచుతో కప్పుకొనిపోయి,