Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

కృష్ణమూర్తి తత్వం

అనుకుంటాం. అందువల్ల నయాగరా జలపాతంలాగా మాటలు ప్రవహిస్తాయి. ఈ ఒక్క సమావేశంలోనే కాదు, ప్రపంచమంతటా యిదే జరుగుతున్నది. ప్రతివారూ అంతులేకుండా మాట్లాడుతునే వుంటారు. అసంఖ్యాకమైన సూత్రాలు, కొత్త కొత్త సిద్ధాంతాలు వున్నాయి; యివి చాలనట్లు మన దుర్బాగ్యం కొద్దీ కొత్త కొత్త నాయకులు - రాజకీయ రంగంలోను, ఆధ్యాత్మిక రంగంలోను కూడా వున్నారు. ఎదుటి మనిషి ఏం చేయాలో, ఏం ఆలోచించాలో చెప్పి, అతన్ని నమ్మించడానికి రకరకాలైన సిద్ధాంతాల ప్రచారము జరుగుతున్నది. ఎట్లా ఆలోచించాలో తెలుసుకోవడం చాలా కష్టసాధ్యమైన పనుల్లో ఒకటి. మన సమస్య కేవలం సాంఘికమైనదో, ఆర్ధికమైనదో, అటువంటిదే మరొకటో కాదు. అంతకంటే ఎక్కువగా అది ఒక ఆధ్యాత్మికమైన సమస్య. చేతన సమస్తంలోనూ ఒక విషమ పరిస్థితి ఏర్పడిన సమస్య. ఇక్కడ మాటలమీద, వ్యాఖ్యానాల మీద, నిర్వచనాల మీద మనం ఆధారపడితే అది అర్ధవిహీనంగా వుంటుంది. ఈ ప్రసంగాలు బహుశ మీకు ఏం ఆలోచించాలో కాకుండా, ఎట్లా ఆలోచించాలో అనేది సూచించి వుంటాయి. సిద్దాంత ప్రచారం మనల్ని దాస్యంలో పడేస్తుంది. ఏం ఆలోచించాలి అనేది- గీత, ఖురాను బైబిలు, మతాచారుడు, మార్కు లెనిన్ సూత్రాలు, అసంఖ్యాకమైన సిద్ధాంతాలు- చెప్పాయి. అయితే, గాఢంగా ఆలోచించడం ఎట్లా అనేది, ఆలోచనలు ఒక పరిధికే పరిమితం అయి వుంటాయి అనేది మనకు తెలియని విషయాలు.

మనకి వున్న చాలా పెద్ద సమస్యల్లో ఒకటి- బహుశ ఒకే ఒక పెద్ద సమస్య. ఏదంటే, దుఃఖం, దుఃఖాన్ని పరిష్కరించుకోవడానికి, దుఃఖాన్ని అంతమొందించడానికి మనిషి అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. దాని నుంచి పారిపోదామని ప్రయత్నించాడు. దానిని పూజించాడు. దానికి ఎన్నో వ్యాఖ్యానాలు కల్పించాడు. కాని పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు మనిషి అంతులేకుండా యీ దుఃఖంలో మునిగితేలుతునే వున్నాడు. నాకేమనిపిస్తుందంటే, మనిషి యీ సమస్యను- మాటల్లో కాదు, భావాలలో కాదు, వ్యాఖ్యానాల్లో కాదు, అసలు వాస్తవంలోనే- ఆగకుండా ప్రవహిస్తున్న యీ దుఃఖ ప్రవాహంలో నుంచి బయటకు అడుగు పెట్టడం ద్వారా పరిష్కరించుకోనట్లవుతే, అతని సమస్యలు యింకా కోకొల్లలవుతాయి. మీరు చాలా ఐశ్వర్యవంతులై వుండచ్చు, మీ వద్ద అధికారం, అంతస్తు, పేరు ప్రతిష్టలు, హోదా, అన్నీ వుండచ్చు. మీరు చాలా తెలివిగలవారై వుండచ్చు, మీది ఎంతో సమాచారం సేకరించిన పదునైన బుర్ర అవచ్చు; అయినా సరే, యివన్నీ దుఃఖం అనే యీ అత్యంత ప్రధానమైన సమస్యా పరిష్కారానికి మనిషి చేసే ఒత్తిడులకు, మానవుడు పడే ఆతురతకు సమాధానం చూపలేవు, అని నాకు అనిపిస్తున్నది, ఎందుకంటే