పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసంగాలు

47

మీలో దయా లేదు, దాక్షిణ్యం లేదు. మీ ధ్యాసనంతా మీ మీదే ఎంతగా కేంద్రీకరించుకొని వుంటారంటే మీలో ప్రేమ అనేదే వుండదు. ప్రేమ లేనప్పుడు యిక వుండేది అంతా దుఃఖమే. కేవలం చిలక పలుకుల్లోగా మీరు వల్లించడానికి చెప్పిన సూక్తి కాదు యిది. ఇది మీరే గ్రహించాలి, మీరే కని పెట్టాలి. దానికోసం మీరు బాగా కృషి చేయాలి. మిమ్మల్ని మీరు అవగాహన చేసుకుంటూ, నిర్విరామంగా, గాఢోద్వేగంతో కృషి చేయాలి. గాఢోద్వేగం అంటే కామం కాదు. గాఢోద్వేగం అంటే ఏమిటో తెలియని మనిషికి ప్రేమ అంటే ఏమిటో ఎన్నటికీ తెలియదు. సంపూర్ణమైన తన్మయత్వం అంటే స్వీయాన్ని పూర్తిగా పరిత్యజించడం వున్నప్పుడే ప్రేమ కలుగుతుంది. ప్రేమ మాత్రమే క్రమతను, ఒక నూతన సంస్కృతిని,ఒక క్రొత్త జీవన మార్గాన్ని తీసుకొని రాగలుగుతుంది.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, XVII వాల్యూమ్,

మూడవ ప్రసంగం, బొంబాయి, 1967


దుఃఖాన్ని సమాప్తం చేయడం

ఇది చివరి ప్రసంగం. ఇక్కడ జరిగిన గత మూడు సమావేశాలలో మనిషి ఏ దిశగా పయనం సాగించాలి అన్నది చాలావరకు సూచించామనే అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తూ వున్న యీ ప్రపంచం చాలా చాలా అల్లకల్లోలంగాను, మహా హింసాత్మకంగాను, దాదాపుగా అరాజకంగా, సంఘవిద్రోహ కరంగా తయారవుతున్నది. ఒక పక్కన యుద్ధం వున్నది, విపరీతంగా దోపిడీ చేయడం వున్నది, బలహీనులను స్వప్రయోజనానికి వాడుకోవడం వున్నది; దయా దాక్షిణ్యాలు లేని కార్యసాధకత్వం, అవకతవక పరిపాలన, అసమర్ధ ప్రభుత్వం మొదలైనవి వున్నాయి. మనందరం- మనలో ప్రతి వొక్కరూ ఎదుర్కోవలసిన ఎన్నో సమస్యలను వరసగా ఏకరువు పెట్టచ్చు. మన దురాశలతో, మన దుఃఖాలతో, సంఘర్షణలతో, సుఖాపేక్షలతో, యితరుల పై పెత్తనం చేయాలనే కాంక్షా, హోదా కోసం ఆరాటమూ వంటి వాటితో మనమే తయారు చేసుకున్న ప్రపంచం యిది.

అనేకంగా వున్న యీ సమస్యలను ఒక్కటొక్కటిగా వివరించుకుంటూ పోవచ్చు, అయితే సమస్య ఎదురుగా నిలబడి మనల్ని నిలదీసినప్పుడు వర్ణనకి, వివరణకి వుండే విలువ శూన్యం. దురదృష్టం ఏమిటంటే వివరణలు చాలా సులభంగా మనల్ని సంతృప్తి పరుస్తాయి. మాటలు నిజంగానే మన సమస్యల్ని పరిష్కరిస్తాయని