ప్రసంగాలు
49
దుఃఖం అంతమైన తరువాతే వివేకం వుదయిస్తుంది. వివేకం అంటే గడసరితనం కాదు, జ్ఞానం కాదు, సిద్ధాంతాలు కావు. వివేకం కలిగేది దుఃఖం అంతమైనప్పుడే. ఈ వివేకం లేకుండా మన మానవ సమస్యలను, బాహ్యంగానూ, అంతర్గతంగానూ కూడా, మనం పరిష్కరించుకోలేము.
చరిత్ర గతిని పరిశీలించినా, మన స్వంత జీవితంవైపు చూసుకున్నా, నిత్యజీవితంలోని మన కార్యకలాపాలు పరిశీలించినా సుఖదుఃఖాలు అనే సూత్రంలో మనిషి చిక్కుకొని పోయినట్లుగా మనం తెలుసుకోవచ్చు. సుఖమే మనల్ని నడిపిస్తూ వుంటుంది. మనలో చాలా మందికి కావలసినది సుఖమే. ఎంతో గోప్యంగా దాన్ని మనం వెంటాడుతూ వుంటాం. ఆధ్యాత్మికులందరూ సత్యం కోసం అన్వేషిస్తున్నాం అని సాధారణంగా అంటుంటారు తప్ప, నిజంగా వాళ్ళు వెతుకుతున్నది సుఖానికి ఒక సూత్రం కని పెట్టడం కోసమే. సుఖం, అది ఏ రూపంలోనైనా సరే, వున్నప్పుడు దుఃఖం కూడా దాని వెంటనంటే వుంటుంది. ఒకటి లేకుండా మరొక దానిని పొందలేము. ఇంద్రియనుభూతి అయిన సుఖమే కాకుండా, యింద్రియానుభూతి నిచ్చే సంతోషమే కాకుండా, మీరు కనుక కొంత అభిరుచి గల మనిషవుతే, కొంత సంస్కారం వున్నవారవుతే, యింకా కొంత మేధావి రకం అవుతే- సంస్కరణాభిలాష ద్వారా, మంచి పనులు చేయడం ద్వారా, సమాజాన్ని మార్చడం ద్వారా కలిగే సుఖం కూడా వుంటుంది. పుస్తకాలు రచించడం, రాజకీయాల్లో చేరడం, మీ ఆకాంక్షలను సార్థకం చేసుకోవడానికి చేసే అంతులేని కార్యకలాపాలు యివన్నీ కూడా సుఖ సంతోషాలని పెంచుకోవడానికే. మీ జీవితంవైపు మీరు పరిశీలించి చూసుకుంటే, మీలో ఆ స్పృహ కనుక కాస్తయినా వున్నట్లవుతే, మీ అభిరుచులు, మీ స్వభావ గుణాలే మిమ్మల్ని నడిపిస్తున్నాయని తెలుసుకుంటారు. మరింత మరింత ఎక్కువ సుఖతృప్తి కోసం జరిగే నిరంతరమైన ఒత్తిడి ఫలితంగా జనించినవే యీ అభిరుచులు, స్వభావగుణం అన్నవి. నిజంగా చూస్తే సద్గుణాలు అనేవి యీ సుఖం అనే సూత్రం మీద ఆధారపడినవే. ఈ సుఖాన్ని గురించి అవగాహన చేసుకోనంతవరకు దుఃఖాన్ని అంతం చేయడం జరగదు. ఇదంతా కొంత లోతుగా మీకు వివరిస్తాను.
అసలు జీవితం అంటే సుఖమేనా? జీవితం అంటే సంఘర్షణలూ, దారుణమైన బాధలూ, బయటా లోపలా వుండే ముగింపు లేని పోరాటాలూనా? రణరంగంగా తయారయిన జీవితం- మనకు తెలిసినదంతా యింతే. మనం సిద్దాంతాలు అల్లవచ్చును; వేదాంతపరమైన ప్రతిపాదనల్ని గురించీ, సమాజాభివృద్ధి గురించీ, ఏం జరగాలి అనే విమర్శలు చేస్తూ అంతులేకుండా మాట్లాడవచ్చు. కానీ, సుఖం కావాలని కోరే యీ విపరీతమైన ఒత్తిడిని అవగాహన చేసుకోక పోతే మాత్రం సంఘర్షణ,