ప్రసంగాలు
41
ఇప్పుడు మేము వివరించ బోయేదానిని. అంటే ఆలోచన యొక్క మూలాన్ని, ఆరంభాన్ని - అర్ధంచేసుకోవాలంటే తనని తాను అర్థంచేసుకోవాలి. దీని అర్థం తనని గురించి తను నేర్చుకోవాలి అని. తనని గురించి సమాచారాన్ని ఆర్జించడమూ, తనని గురించి నేర్చుకుంటూవుండటమూ అన్నవి రెండూ రెండు భిన్న విషయాలు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా గమనించడం ద్వారా, మిమ్మల్ని మీరు పరీక్షించుకొనడం ద్వారా మీ గురించి జ్ఞానాన్ని పోగుచేసుకోవచ్చును. ఈ తెలుసుకున్న దానినుండి, యీ నిలవ చేసుకున్నదాని నుండి మీరు చర్య తీసుకోవడం సాగిస్తారు. ఈ విధమైన చర్యలలో నుండి మరికొంత మీరు ఆర్జిస్తున్నారన్నమాట. అర్ధమైందా? మీరు తెలుసుకున్నది, మీరు పోగుచేసుకున్నది ఎప్పుడో గతంగా మారి పోయింది. పోగుచేసుకున్నదంతా గతంలోనిదే, ఆ గతం నుండి పరిశీలించడం మొదలు పెట్టి మరికొంత పోగు చేసుకుంటారు. అయితే నేర్చుకోవడం అన్నది మాత్రం పోగుచేసుకోవడం కాదు, నేర్చుకుంటూ వుండటం వుంటూనే వుంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఆ క్రియతో పాటుగా మీరు కదులుతుంటారు. కాబట్టి యీ నేర్చుకోవడంలో అడుగున మిగిలివుండే అవశేషం ఏమీ వుండదు. ఎప్పటికీ నేర్చుకుంటూ వుండటమే. నేర్చుకుంటూ వుండటం సకర్మకవర్తమాన క్రియా శబ్దం, కర్మణి వర్తమాన క్రియ కాదు. మనం నేర్చుకోబోతున్నాం, అయితే పోగుచేసి వుంచిన వాటినుండి కాదు. ఒక భాషని నేర్చుకుంటున్నప్పుడు పోగుచేసుకోవడం వుంటుంది. ఆ శబ్దాలన్నీ తెలుసుకోవాలి, రకరకాల క్రియా పదాలను నేర్చుకోవాలి, యింకా అటువంటివి ఎన్నో వుంటాయి. నేర్చుకున్న తరువాత వాటిని మీరు వుపయోగించడం మొదలు పెడతారు. అయితే యిక్కడ మాత్రం అట్లా కానేకాదు. ఒక అపాయాన్ని చూశారంటే తక్షణమే చర్య తీసుకుంటారు. ఒక కొండ శిఖరం మీద చిట్ట చివరి అంచు వంటి ప్రమాదాన్ని చేరుకోగానే తక్షణమే మీరు క్రియను చేస్తారు.
కాబట్టి, మనం యిప్పుడు చేయబోతున్నది ఏమిటంటే ఆలోచన యొక్క మూలాన్నీ, ఆలోచన యొక్క ఆరంభాన్ని కనిపెట్టడం, అవగాహన చేసుకోవడం. ఆ పని చేయాలంటే దానిని వినడం, దానితో పాటు పయనించడం అవసరం; అంటే అర్ధం మీ సావధానత్వాన్ని యివ్వాలి. మీరు గాఢంగా తరచి విచారణ చేస్తున్నప్పుడే సావధానంగా వుండటం సాధ్యమవుతుంది. అంటే తరచి విచారణ చేయడానికి మీరు నిజంగానే స్వేచ్ఛగా వున్నారని, ఎవరో చెప్పిన మాటలు మిమ్మల్ని బంధించి వుంచలేదని అర్థం.
సరే, ప్రాణికోటి అంతా జీవశక్తితో నిండివుంది. నిరంతరమైన కదలిక ఆది. ఈ జీవశక్తి తన కదలిక ద్వారా ఒక పద్ధతిని తయారుచేస్తుంది. ఇదంతా స్వీయరక్షణ,