Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

కృష్ణమూర్తి తత్వం

యివన్నీ ప్రపంచంలో చాలా అనర్థాలని కలిగించాయి. ఇవన్నీ యింకా కొనసాగు తుండటమే అస్తవ్యస్తత అని అంటున్నాను. క్రమతను తీసుకురావాలంటే అస్తవ్యస్తత నిర్మాణ స్వరూపాన్ని అవగాహన చేసుకోవాలి. ఈ అస్తవ్యస్త తలోని ప్రధాన అంశాల్లో ఒకటి ఏమిటంటే ఆధిపత్యం. భయం కారణంగా మనం ఆధిపత్యానికి తలవంచుతున్నాం. "నాకేమీ తెలియదు; మీకు తెలుసు; దయచేసి నాకు చెప్పండి" అనీ మీరు అంటారు. మీకు చెప్పగలిగినవారు ఎవ్వరూ లేరు. అది మీరు గ్రహించారంటే అప్పుడు ప్రతిదీ పూర్తిగా మీ అంతట మీరే తెలుసుకోవాలి, అంతర్గతంగా, మానసికంగా; మీకు సహాయం చేయడానికి అప్పుడిక ఏ నాయకుడూ వుండడు, గురువూ వుండడు, తత్వవేత్త వుండడు, ఏ మహాత్ముడు వుండడు. ఎందుకంటే వారంతా వ్యవహరిస్తూ వుండేది ఆలోచన స్థాయిలోనే కాబట్టి. ఆలోచన ఎప్పుడూ పాతదే. ఆలోచన ఏనాటికీ మార్గదర్శకత్వం చూపలేదు.

అందుకని, ఆలోచన యొక్క మూలాన్నీ, ఆరంభాన్ని మనం కనిపెట్టబోతున్నాం. ఇది చాలా ముఖ్యం. దయచేసి యిది శ్రద్ధగా వినండి. అయితే వట్టి శబ్దాలను కాదు. వినడం అంటే ఏమిటో మీకు తెలుసునా? నేర్చుకోవడం కోసం కాకుండా కేవలం వినాలి. నేర్చుకోవడం కోసం వినకండి, మీ స్వీయాన్ని పూర్తిగా వదిలివేసి వినండి. అప్పుడు నిజమేమిటో, బూటకం ఏమిటో మీకే తెలుస్తుంది. అంటే దాని అర్థం మీరు అంగీకరించడమూ లేదు, తిరస్కరించడమూ లేదు. అంటే మీ మనసు తెరచిపెట్టివున్న ఒక జల్లెడ వంటిదనీ, అందులో ఎన్నిపోసినా ఏవీ మిగలవనీ కాదు అర్థం. అందుకు పూర్తిగా విరుద్ధమైనది. మీరు వింటున్నారు కాబట్టి అపరిమితమైన సున్నితత్వంతో వుంటారు. ఆ కారణంగా అత్యంతమైన విమర్శన శీలత కలుగుతుంది. అయితే, మరొకరి ఆభిప్రాయానికి వ్యతిరేకంగా వున్న మీ అభిప్రాయం మీద మాత్రం మీ విమర్శనశీలత ఆధారపడివుండదు. అదంతా ఆలోచనా ప్రక్రియ చేసే పని. దయచేసి కారులు చేస్తున్న ఆ ధ్వనులను వింటున్నట్లుగా వినండి. ఇష్టంతోనూ కాదు, అయిష్టతతోనూ కాదు, పిల్లవాడు సుత్తితో దేనినో కొడుతున్న ఆ శబ్దాన్ని మాత్రమే వినండి, చిరాకు పడకుండా, మీ ధ్యాసను చెదిరిపోనీయకుండా. అంత సంపూర్ణంగా మీరు వింటున్నప్పుడు, మరింకేమీ చేయడానికి వుండదని తెలుసుకుంటారు. నది ఒడ్డు పై నిలబడి చూస్తున్నవారు మాత్రమే ప్రవాహంలోని సొందర్యం గురించి వూహాగానాలు చేస్తుంటారు. ఒడ్డును దిగి వారు ప్రవాహంలో అడుగు పెట్టాక, అప్పుడిక వూహాగానం వుండదు, అప్పుడు ఆలోచన వుండదు. కదలిక మాత్రమే వుంటుంది.