Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసంగాలు

45

ఆధిపత్యాన్ని, మరొకరి నిరంకుశత్వాన్ని మాత్రం ఒప్పుకుంటారు. అంటే యింకొకరెవరో సత్యానికి దారి యిది అని ఒక సాధన మార్గాన్ని నిర్ణయిస్తే, దానికీ లొంగిపోయి అనుసరించడం కోసం మనసుల్ని మనం వక్రంగా చేసుకుంటాం, మన ఆలోచనల్ని వక్రంగా చేసుకుంటాం, మన జీవిత విధానాన్ని వక్రంగా చేసుకుంటాం. ఈ విధంగా చేస్తున్నప్పుడు మనలోని నిర్దుష్టతను మనం ధ్వంసం చేసుకుంటున్నామన్నమాట. నిర్దుష్టతని అంటే కాంతిని మనంతట మనమే కనిపెట్టాలి తప్ప యింకొకరి ద్వారాగానీ, ఒక గ్రంధం ద్వారాగానీ, ఒక మహాత్ముడి ద్వారా గానీ కాదు. ఈ మహాత్ములంతా సాధారణంగా వక్రబుద్ధిగల మనుష్యులై వుంటారు. చూసేవారికి చాలా నిరాడంబరంగా కనబడే వారి జీవీతాలు అందర్నీ విస్మయపరుస్తాయి. కానీ, వారి మనసులు మాత్రం వంకర తిరిగి వుంటాయి. వాళ్ళ దృష్టిలో పరమసత్యం అనీ అనుకుంటున్నదానిని వాళ్ళే తయారు చేసి పెడుతుంటారు.

అయితే, అస్తవ్యస్తతను పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే, ఆధిపత్యం యొక్క సమస్త స్వరూపాన్ని, అంతర్గతంగా వుండేదానినీ, బాహ్యంగా వుండే దానిని కూడా అవగాహన చేసుకోవాలి. బాహ్య ప్రపంచంలో వుండే ఆధిపత్యాన్ని మనం కాదనలేము. అది అవసరం కూడా. ఏ నాగరిక సమాజంలోనైనా అది అవసరమే. అయితే మేము మాట్లాడుతున్నది యింకొక మనిషి ఆధిపత్యం గురించి. అంటే, అందులో యీ వక్త ఆధిపత్యం కూడా వుంటుంది. మనమంతా యీ సమాజంలోని వారమే కాబట్టి, మనలో ప్రతి ఒక్కరం కలిగించే అస్తవ్యస్తతను అర్ధం చేసుకుంటే తప్ప క్రమతను సాధించలేము. మనమే యీ సమాజ స్వరూపాన్ని నిర్మించాము, యీ సమాజంలోనే మనం చిక్కుకొని పోయాం. జంతువుల నుండి సంక్రమించిన జంతులక్షణాలకు వారసులమైన మనం, మానవజాతికి చెందిన మనం, మనుష్య ధర్మంగా కాంతిని, క్రమతను కనిపెట్టాలి. అయితే యీ కాంతినీ, క్రమతనూ లేదా అవగాహనను ఎవరో మరొక మనిషి ద్వారా కనిపెట్టలేము. ఆ మనిషి ఎవరయినా సరే- ఎందుకంటే యింకొక మనిషి అనుభవాలు బూటకమై వుండచ్చు. అన్ని అనుభవాలనూ ప్రశ్నించి తీరాలి. అవి మీవయినా సరే, మరొకరివైనా సరే; అనుభవం అంటే స్మృతులను మూటగట్టుకొని అవే కొనసాగించు కుంటూ వుండటం, ఒక స్పందనకు మనం యిచ్చే ప్రతిస్పందనను తమ నిబద్ధీకరణను బట్టి స్మృతులు మార్చి వేస్తూ వుంటాయి. అంటే- అనుభవం కలగడం అంటే ఒక స్పందనకు ప్రతిస్పందించడం, అవునా కాదా?

అనుభవం మన వెనకటి నేపధ్యాన్ని అనుసరించే ప్రతిస్పందించగలదు. మీరు ఒక హిందువో, ముస్లిమో, క్రిస్టియనో అవుతే ఆయా మతాలు మిమ్మల్ని నిబద్ధుల్ని