ప్రసంగాలు
31
గాడమైన వుద్వేగం మీలో వున్నప్పుడే మీరు వింటారు. ఏ విషయమైనా సరే, దేని కోసం మిమ్మల్ని మీరు సంపూర్ణంగా పరిత్యజించుకో లేక పోతే మీలో గాఢోద్వేగం లేనట్లే. ఆ విధంగా మీ స్వీయాన్ని సంపూర్ణంగా పరిత్యజించి వింటూ వుంటే మీకు సాధ్యమైనదంతా మీరు చేసినట్లే. ఎందుకంటే అప్పుడు సత్యాన్ని మీరు చూస్తారు. ప్రతి రోజులోను వుండే సత్యాన్ని, ప్రతి ఒక్క చర్యలోను వుండే సత్యాన్ని, ప్రతి ఆలోచనలోను, ప్రతి రంగంలోనూ వున్న సత్యాన్ని వున్నది వున్నట్లుగా చూస్తూ వుంటారు. రోజువారీ జీవితపు కదలికలోని, రోజువారీ కార్యకలాపాలలోని, నిత్యకృత్యపు పనిలోని, నిత్యజీవితపు ఆలోచనలలోని సత్యాన్ని చూడటం ఎట్లాగో మీకు తెలియకపోతే మీరు దీనికి ఆవలగా ఎన్నటికీ పోలేరు; చేతనావర్తపు పరిధులకు ఆవలగా ఏమున్నదో దానిని మీరు ఏనాటికీ కనుక్కోలేరు.
కాబట్టి, మేము యింతకు ముందు చెప్పినట్లుగా, స్వేచ్చని అవగాహన చేసుకోవడం దానికి సంబంధించిన క్రమశిక్షణను కూడా తీసుకొస్తుంది. ఆ క్రమశిక్షణ అనుసరణ కాదు, లొంగిపోయివుండటం కాదు; ఉదాహరణకు, మరణంవైపు మీరు చాలా సావధాన శీలతతో చూడగలుగుతారు; ఆ చూడటమే క్రమశిక్షణ. మేము చెప్పినట్లుగా చేతనావర్తం పరిమితులు కలది. ఈ పరిమితుల వరకు ఆలోచనకు అందుబాటులోనే వుంటుంది. అయితే యీ పరిమితులను పగలగొట్టుకోని ఆలోచన దాటిపోలేదు. ఈ నిబద్దీకరణాన్ని బ్రద్దలు చేయాలంటే ఎంతటి మానసిక విశ్లేషణ కానీ, ఎటువంటి తత్వశాస్త్రాలు కానీ, ఎంతటి శారీరక క్రమశిక్షణ కానీ సరిపోదు. ఆలోచనకి సంబంధించిన యంత్రాంగాన్నంతా అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే దీనిని బ్రద్దలు చేయగలుగుతాం. ఇంతకు ముందే చెప్పినట్లుగా ఆలోచన పాతది, కొత్తవాటిని ఏనాటికీ కనిపెట్టలేదు. తను ఏమీ చేయలేను అనే సంగతిని ఆలోచన గ్రహించుకున్నప్పుడు, ఆలోచన అనేదే అంతమై పోతుంది. ఆ విధంగా చేతనావర్తం యొక్క పరిమితులను బ్రద్దలు చేయడం జరుగుతుంది.
ఈ బ్రద్దలు చేసి దాటుకొనిపోవడమే పాతదానికి చనిపోవడం. ఇది ఒక సిద్ధాంతం కొదు. దీనిని అంగీకరించనూ వద్దు, నిరాకరించనూ వద్దు. 'ఇది చాలా మంచి యోచన' అనీ అనకండి, చేయండి. అప్పుడు నిన్నకు చనిపోవడంలో అమాయక శీలత వుద్బవిస్తుందని మీ అంతట మీరే కనీ పెడతారు. అప్పుడు ఆ అమాయకత్వంలో నుండి పూర్తిగా విభిన్న కరమైన చర్య వస్తుంది. మానవులు దీనిని కనిపెట్టనంతవరకు, వాళ్ళు ఏంచేసినా సరే ఎన్ని సంస్కరణలు, ఎన్ని పూజా పునస్కారాలు, ఎన్ని రకాల పలాయనాలు, ఐశ్వర్యాన్ని ఆరాధించడం వంటివి ఎన్ని చేసినా సరే- వాటి వల్ల లాభం లేదు.