30
కృష్ణమూర్తి తత్వం
ఒకప్పుడు వుండిన దాని కొనసాగింపు మాత్రమే కలిగివున్న మనస్సు నూతనమైనది ఏదీ సృష్టించలేదని మీరు గ్రహిస్తారు. వైజ్ఞానిక రంగంలో కూడా మనస్సు పూర్తిగా ప్రశాంతంగా వున్నప్పుడే నూతనా విష్కరణలు సాధ్యమవుతాయి. కాబట్టి, నిన్నలకు, స్మృతులకు, గాయాలకు, సుఖాలకు చనిపోవడం అంటే అమాయకంగా, స్వచ్ఛంగా అవడం. మృత్యు రాహిత్యం, అంటే మరణం లేకుండా శాశ్వతంగా కొనసాగడం కంటే అమాయకత్వం చాలా ఎక్కువ ప్రాధాన్యం కలది. ఆలోచన అమాయకత్వాన్ని తాకలేదు. అయితే మృత్యురాహిత్యాన్ని ఆలోచన ముస్తాబు చేసి తయారు చేస్తుంది.
కాల్పనిక బింబాన్ని తయారుచేసే యంత్రాంగం నడవడానికి ఆధారం శక్తి. ఈ శక్తికి వున్న ముఖ్య సూత్రం ఏమిటంటే సుఖాన్ని వెతుక్కోవడం. మనం చేస్తున్నది అదే. అదే కదూ? మనకందరికీ సుఖం కావాలి. ఆ సూత్రం మీదే మనం పనిచేస్తూ వుంటాం. ఆ సూత్రం మీదే మన చర్యలన్నీ వుంటాయి. మన నీతి సూత్రాలు, మన సామాజిక సంబంధ బాంధవ్యాలు, దేవుడు అని అంటుంటారే- దానికోసం అన్వేషణ యింకా యితరాలు. అవన్నీ సుఖం కోసమే, సుఖలాలసను తృప్తిపరచడంకోసం చేసేవే, సుఖం అంటే కోరికను ఆలోచన ద్వారా కొనసాగించడం, ఎప్పటికీ వుండేలాగా.
అమ్మా, మేడం! దయచేసి యిదంతా కాగితం మీదికి ఎక్కించకండీ. దీనికి పరీక్షలు లేవు. నోట్సు రాసుకొని యింటికి తీసుకెళ్ళి, ఆలోచించి, ఆ పైన సమాధానాలు వ్రాసెయ్యడానికి. మనం అందరం కలిసి యీ పని చేస్తున్నాం. మీరు క్రియ చేస్తూ వున్నప్పుడు తక్కినవాటికీ వ్యవధానం లేదు. మీరు యదార్థంగా జీవిస్తున్నప్పుడు, అదే ప్రస్తుతం. రేపు కాదు. మీరు యిది గాఢంగా అర్ధం చేసుకుంటూ వుంటే, నోట్సు రాసుకోవడానికి మీకు సమయం వుండదు. దయచేసి వినండి.
వినడం అంటే నేర్చుకోవడం. నేర్చుకోవడం అంటే కూడబెట్టుకోవడం కాదు. అంటే మీరు నేర్చుకున్న తరువాత, ఆ నేర్చుకున్న దానిలో నుంచే మీ చర్యలు వుంటే- అటువంటి నేర్చుకోవడం వట్టి కూడబెట్టుకోవడమే అవుతుంది. కూడబెట్టుకున్నాక, ఆ కూడబెట్టిన వాటిని ఆధారం చేసుకొని మీ చర్యలు వుంటాయి. ఆ విధంగా మీరు ఘర్షణను సృష్టిస్తారు. మీరు కనుక వింటుంటే, అంతకంటే చేయవలసినది యింకేమీ వుండదు. మీరు చేయవలసినదంతా కేవలం వినడమే. ఆ చెట్టువైపు చూసినట్లుగా, ఆ చంద్రుడి వైపు చూసినట్లు, ఏ ఆలోచన లేకుండా, ఏ తాత్పర్యాలూ చెప్పుకోకుండా. ఊరికే వింటూ వుండండి. అందులో ఎంతో సొందర్యం వుంది. ఆ వినడమే స్వీయాన్నీ పూర్తిగా పరిత్యజించడం. అట్లా చేయని పక్షంలో మీరు వినలేరు.