పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

కృష్ణమూర్తి తత్వం

ఏదయినా వున్నదేమో అనేది మీరు తెలుసుకో గలుగుతారు. ఇది స్పష్టంగా వుందా? ఇప్పుడు యింకా కాస్త వివరించి చెప్పడానికి ప్రయత్నిస్తాను.

చూడండీ, మనిషి ఎప్పుడూ తనని మించి ఆవలగా వున్నదానికోసం, ఒక పరతత్వం కోసం అన్వేషిస్తూనే వున్నాడు; దానిని “దైవం” అన్నాడు, “పరమచైతన్యం” అనీ యింకా రకరకాల పేర్లతోనూ పిలిచాడు. అతడు యిదంతా ఒక కేంద్రం నుంచి ఆరంభించాడు. అదే అతని మొత్తం చేతనావర్తం, సర్! యిటు చూడండి, మరొక విధంగా వివరిస్తాను. మనిషిలోని చేతన కాలం కారణంగా ఏర్పడినది, తను నివసిస్తున్న సంస్కృతి ఫలితంగా ఏర్పడినది. సంస్కృతి అంటే సాహిత్యం, సంగీతం, మతం- యివన్నీ అతన్ని నిబద్ధీకృతం చేశాయి. అతను ఒక సమాజాన్ని నిర్మించు కొన్నాడు, యిప్పుడు ఆ సమాజానికే అతను దాసుడయ్యాడు. ఇది స్పష్టంగా వుందా? కాబట్టి మనిషి తను నిర్మించుకున్న సమాజంచేత నిబద్ధుడయాడు, ఆ సమాజం అతన్ని యింకా యింకా నిబద్ధీకరణకు లోనుచేస్తున్నది. మళ్ళీ యిందులో నుండి బయటపడటంకోసం, ఆ స్పృహతోనో, తనకే తెలియకుండానేనో మనిషి అన్వేషిస్తూనే వున్నాడు. స్పృహతో అంటే- మీరు ధ్యానం చేస్తుంటారు, పుస్తకాలు చదువుతుంటారు, మత సంబంధమైన కర్మకాండల్లో పాల్గొంటుంటారు, యీ నిబద్దీకరణం నుంచి తప్పించుకొని పారిపోవడానికి యింకా అవీ యివీ చేస్తుంటారు. తెలుసుకున్న స్పృహతోనో, ఆ స్పృహ లేకుండానేనో చేతనత్వపు పరిధులను దాటి ఆవలగా వున్న దానిని అందుకోవాలనే ఒక వెతకులాట, ఒక అన్వేషణ సాగుతూ వుంటుంది.

కాలం కారణంగా జనించిన ఆలోచన తన నిబద్ధీకరణాన్నీ దాటుకొని ఆవలగా వెళ్ళగలనా అని విచారణ చేస్తూ వుంటుంది; అది సాధ్యమనో, అసాధ్యమనో మళ్ళీ తనే అంటూవుంటుంది; లేదా ఆవలగా ఏదో వున్నదని గట్టిగా నొక్కి చెప్తూవుంటుంది. కాబట్టి, కాలం ఫలితంగా జనించిన ఆలోచన, చేతనా వర్తం అంతటికీ- అంటే చేతనకీ, అంతఃచేతనకీ కూడా రంగస్థలం అయిన ఆలోచన, నూతనమైనదానిని ఏదీ కనిపెట్టలేదు. ఎందుకంటే ఆలోచన ఎప్పటికీ పాతదే. అనేక లక్షల సంవత్సరాలను జ్ఞాపకాలుగా పోగు చేసుకున్నదే ఆలోచన. జంతువుల నుండి వారసత్వంగా సంక్రమించినదాని ఫలితమే ఆలోచన. నిన్నటి అనుభవం గురించిన జ్ఞాపకమే ఆలోచన. కాబట్టి, చేతన పరిధులను దాటుకొని ఆవలగా పోగలగడం ఆలోచనకు ఎన్నటికీ సాధ్యంకాదు.

అందుకని, మీరు ఒక చెట్టువైపు చూస్తున్నప్పుడు, ఆలోచన ఆ చెట్టుని గురించి సృష్టించిన ఒక కాల్పనిక బింబాన్ని చూస్తూ వుంటారు. మీ భార్య వైపో, భర్తవైపో, మీ రాజకీయనాయకుడు, మీ ఆధ్యాత్మిక గురువు మొదలైనవారి వైపో చూస్తున్నప్పుడు,