ప్రసంగాలు
23
ఆమెవైపు లేదా అతనివైపు మీరు ఏర్పరచుకొన్న ఆ కాల్పనికరూపం ద్వారా చూస్తారు, సంబంధ బాంధవ్యం కూడా మీరు పెంచుకున్న ఆ రెండు కాల్పనిక రూపాల మధ్యనేయిద్దరు మనుష్యుల మధ్యన కాదు. కాబట్టి మీరు నిజంగా చూడటం లేదు; ఒక కాల్పనిక బింబం మరో కాల్పనిక బింబాన్ని చూస్తున్నది. అంతే.
ఇది ముఖ్యంగా మీరందరూ గ్రహించవలసిన సంగతి. ఎందుకంటే యిప్పుడు ప్రపంచమంతటా కూడా మానవుల మధ్య వుండే పరస్పర సంబంధాలను గురించే విచారిస్తున్నారు. ఈ కాల్పనిక బింబాలు వున్నంతవరకు పరస్పర సంబంధం అనేది వుండదు. అందువల్లనే మనిషికీ మనిషికీ మధ్యన యీ సంఘర్షణ అంతా వున్నది. మనలో ప్రతి ఒక్కరం ఎదుటివారినీ గురించి ఒక మనో రూపాన్ని సృష్టించుకుంటాం అన్నది అసలైన వాస్తవం. మనం ఒకరివైపు ఒకరం చూసుకుంటున్నప్పుడు, వారిని గురించి మనం ఏర్పరుచుకున్న కాల్పనిక రూపాన్ని లేదో మనల్ని గురించి వారు ఏర్పరచుకున్న కాల్పనిక రూపాన్ని చూసుకుంటున్నాం. ఈ వాస్తవాన్ని మీరు గ్రహించి తీరాలి. చూడటం వేరు, దానిని గురించి మాటల్లో చెప్పడం వేరు. ఆకలి వేస్తుంటే అది మీకు తెలుస్తుంది. మరెవరో వచ్చి మీకు ఆకలిగా వున్నదని చెప్పనవసరం లేదు. చూడండి, మీకు ఆకలిగా వున్నదని ఎవరో వచ్చి చెప్పారనుకోండి, మీరు ఆ వాక్యాన్ని ఆమోదిస్తారు. అయితే, దీని తాత్పర్యం వేరూ, మీకు నిజంగా ఆకలి వేయడం పూర్తిగా వేరు. కాబట్టి, యిదే విధంగా మీకు యితర్లను గురించి కాల్పనిక రూపాలు వున్నాయనేది మీ అంతట మీరే నిజంగా గ్రహించాలి; ఎదుటివారినీ ఒక హిందువుగానో ఒక ముస్లింగానో, ఒక కమ్యునిస్టుగానో, లేక మరొకటిగానో మీరు చూస్తున్నప్పుడు మానవుల మధ్య వుండవలసిన సంబంధ బాంధవ్యాలన్నీ ఆగిపోతాయి. ఎదుటివారిని గురించి మీరు ఏర్పరచుకొన్న ఒక అభిప్రాయం వైపు మాత్రమే మీరు చూస్తున్నారు. అందువల్ల, మేము అడుగుతున్నది ఏమిటంటే, యీ కాల్పనిక బింబాల తయారీలోనే ఒక విప్లవాన్ని తీసుకొనిరావడం సాధ్యమేనా అని. దయచేసి శ్రద్దగా వినండి, దీనిలో ముడిపడి వున్న విషయాలు చాలా ఆశ్చర్యం గొలిపేవిగా వుంటాయి. మానవులు తాము నివసిస్తున్న సమాజం చేత, ఆ సంస్కృతి చేత, మతం చేత, ఆర్ధికమైన ఒత్తిడుల చేత, శీతోష్ణస్థితులు, ఆహారం, వారు చదివే పుస్తకాలు, వార్తా పత్రికల చేత ప్రభావితులై నిబద్ధీకరణం చెందుతున్నారు. వారు నిబద్ధులై వున్నారు, వారి చేతనావర్తం మొత్త నిబద్ధీకృతం అయివుంది. మనం యిప్పుడు కని పెట్టబోతున్న దేమిటంటే యీ నిబద్దీకరణం కాకుండా యింకేదైనా దానిని మించి వున్నదా అని. అయితే, ఆలోచనా స్రవంతి అంతా కూడా చేతనా వర్తం అనే పరిధులలోపలకే పరిమితమై వున్నదని మీరు గ్రహించినప్పుడు మాత్రమే యీ నిబద్ధీకరణకు ఆవలగా