పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసంగాలు

21

అంటే మనిషి సంపూర్ణత్వంలో కొంత భాగాన్ని మాత్రమే 'నాకు అవగాహన అయింది' అన్నప్పుడు మీరు వుపయోగిస్తారు. అంటే ఏమిటంటే, ఆ మాటలు మీ మేధ ద్వారా అవగాహన ఉయాయి, యీ వక్త ఏమనుకుంటున్నాడో అది మీకు అవగాహన అయింది. అయితే యిక్కడ అవగాహన అనే మాటను వుపయోగించినప్పుడు, ఒక వూహా ప్రతిపాదనను మేధాపరంగా ఆకళింపు చేసుకోవడం అనే అర్థంలో మనం వాడటంలేదు. అవగాహన అనే పదాన్ని దాని సంపూర్ణమైన అర్ధంలో వుపయోగిస్తున్నాం. అంటే అవగాహన చేసుకున్నప్పుడు, మీరు చర్య తీసుకుంటారు. ఒక ఆపద వున్నది అనే సంగతి మీరు అవగాహన చేసుకున్నప్పుడు, - ఆపదను మీరు స్పష్టంగా చూసినప్పుడు, తక్షణమే మీరు క్రియని చేస్తారు. అవగాహనలోని క్రియాశీలత్వమే దాని క్రమశిక్షణ. కాబట్టి యీ అవగాహన అనే మాటలోని విశిష్టతను మనం స్పష్టంగా గ్రహించాలి. మనం అవగాహన చేసుకుంటే, తెలుసుకుంటే, ఆకళింపు చేసుకుంటే, విషయాన్ని వున్నది వున్నట్లుగా చూస్తే క్రియ జరుగుతుంది. ఒక విషయాన్ని మీరు అవగాహన చేసుకోపోలంటే, మీ మనస్సునీ, మీ హేతుబుద్ధినీ, మీ శక్తిసామర్థ్యాలనే కాకుండా, మీ మొత్తం సావధానత్వాన్ని వుపయోగించాలి. అట్లా చేయని పక్షంలో అవగాహన వుండదు. ఇది బాగా స్పష్టంగా వుందని ఆశిస్తాను.

కాబట్టి, స్వేచ్ఛ గురించి అవగాహన- అంటే అది తిరుగుబాటు కాదు, అంతకంటే భిన్నమైనది అని మనం తెలుసుకుంటున్నాము. తిరుగుబాటు అంటే పాతుకొని పోయిన వ్యవస్థకు వ్యతిరేకతను ప్రకటించడం- జుట్టు కత్తిరించుకోకుండా పొడుగ్గా పెంచుకునేవారి తిరుగుబాటు వంటివి. ఒక నిర్ణీతమైన పద్ధతికి వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేస్తున్నారు; అయితే, తిరగబడినప్పుడు, మరో కొత్త పద్ధతిలో వాళ్ళు చిక్కుకొనిపోయి, దానికి ఆమోదం తెలుపుతున్నారు. మనం మాట్లాడుతున్నది తిరుగుబాటు కానటువంటి స్వేచ్చను గురించి. ఇది మరొకదాని నుంచి విముక్తి పొందడం కాదు; అస్తవ్యస్తతను అవగాహన చేసుకోవడంలోనే వున్న స్వేచ్ఛ. దయచేసి దీనిని స్పష్టంగా తెలుసుకోండి. క్రమరాహిత్యాన్ని అంటే అస్తవ్యస్త స్థితిని అవగాహన చేసుకోవడంలోనే దానినుంచి విముక్తి వుంది. ఆ స్వేచ్ఛ క్రమతను తెస్తుంది. ఈ క్రమతలోనే క్రమశిక్షణ వుంటుంది.

అంటే అర్థం, ప్రతికూలమైన దానిని అవగాహన చేసుకోవడంలో అనుకూలమైన చర్య జరగడం వున్నది. అనుకూల పక్షపు విధానం అవలంబించడం ద్వారా క్రమత సిద్ధించదు. క్రమరాహిత్యస్థితి అనేది యిక్కడ వున్నది. మానవుడు ఒక నిర్ణీతమైన పద్ధతిని, సామాజిక పద్ధతిని, నైతిక పద్దతిని, మతరీతిని, తన స్వంత వ్యక్తిగతమైన అభిరుచుల పైనా సుఖాల పైనే ఆధారపడిన ఒక పద్ధతిని పట్టుకొని అనుసరిస్తూ