20
కృష్ణమూర్తి తత్వం
తను తయారుచేసే ఒక విప్లవాన్ని, ఒక మానసికమైన విప్లవాన్ని తీసుకొనిరాగలడా అని మనకి క్రమశీలత అత్యవసరం. ఎందుకంటే విపరీతమైన అస్తవ్యస్తత అంతటా ప్రబలిపోయింది. అసలు సామాజిక నిర్మాణ స్వరూపం సమస్తం క్రమరాహిత్యం, పోటీలు, స్పర్థలు, ఎదుటి వాడిని పడత్రోసైనా తాను బతకొలనుకోవడం, మనిషికి మనిషి శత్రువు అనే తత్వం, వర్గవిభజనలు, జాతిభేదాలు, దేశదురభిమానాలు, తెగల విభేదాలు మొదలైన వాటిమీద ఆధారపడి వున్నది. ఈ సమాజ నిర్మాణంలోనే అస్తవ్యస్తత వున్నది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. అనేక రకాల విప్లవాలు-రష్యన్ విప్లవం మొదలైన ఎన్నో రకాలవి సమాజంలో ఒక క్రమశీలత్వాన్ని నెలకొల్ప డానికి ప్రయత్నించాయి కాని అవి ఘోరంగా పరాజయం చెందక తప్పలేదు. రష్యా, చైనాలలో యిదీ కనబడుతున్నది. అయితే మనకు క్రమత చాలా అవసరం, ఒక క్రమ శీలత్వం అనేది లేకపోతే మనం బ్రతకలేము. జంతువులు కూడా ఒక క్రమత్వాన్ని కోరుకుంటాయి. వాటిలో క్రమత అంటే ఆస్తికి సంబంధించినది, సెక్సుకు సంబంధించినది. మనలో అంటే మానవుల్లో కూడా ఆస్తికి, సెక్సుకు సంబంధించిన క్రమశీలతను ఆస్తిపై హక్కుల కోసం వదులుకోవడానికి మనకి అభ్యంతరం లేదు. ఇప్పుడు యీ రంగంలో క్రమతను సాధించడానికి మనం ప్రయత్నిస్తూ వున్నాం.
అయితే స్వేచ్ఛ వున్నప్పుడే క్రమత వుంటుంది. స్వేచ్ఛ అంటే సాధారణంగా చెప్పుకొనే అర్థంలో కాదు. స్వేచ్ఛ ఎక్కడయితే వుండదో అక్కడ అస్తవ్యస్తత వుంటుంది. అందువల్ల అక్కడ నియంతృత్వం వుంటుంది. క్రమతను తీసుకొనిరావడానికి అక్కడ మనుష్యుల మీద బలవంతంగా సిద్ధాంతాలను రుద్దడం వుంటుంది. దానివలన అక్కడ చివరకు మళ్ళీ అస్తవ్యస్తత నెలకొంటుంది. కాబట్టి క్రమత్వం అంటే అందులో క్రమశిక్షణ వుంటుందన్నమాట. అయితే సాధారణంగా క్రమశిక్షణ అని మీరు చెప్పుకొనేది లొంగిపోయి వుండటంమీద, విధేయత మీద, ఒప్పుదల మీద ఆధారపడి వుంటుంది. లేదా భయపెట్టి, శిక్షించి, విపరీతమైన నిరంకుశాధికారం చలాయించి మిమ్మల్ని క్రమబద్ధంగా వుంచడం జరుగుతుంది. అయితే మనం మాట్లాడుతున్న క్రమశిక్షణ, స్వేచ్ఛ అంటే ఏమిటి అన్నది అర్థంచేసుకోవడం ద్వారా కలిగేది. స్వేచ్ఛ అంటే ఏమిటో అవగాహన చేసుకోవడమే స్వేచ్ఛకు ఒక క్రమశిక్షణను కలిగిస్తుంది.
కాబట్టి, 'స్వేచ్ఛ', 'ఆవగాహన' అనే యీ రెండు మాటలకి అర్థం ఏమిటన్నది మనం చక్కగా ఆకళింపు చేసుకోవాలి. సాధారణంగా మనం, 'నాకు యిది అవగాహన అయింది' అన్నప్పుడు మేధాపరంగా, శబ్దపరంగా అది వర్తిస్తుంది. ఏదైనా ఒక విషయాన్ని సుస్పష్టంగా, మీ మాతృభాషలో కానీ, మనిద్దరకూ తెలిసిన ఒక విదేశ భాషలో కానీ చెప్పినప్పుడు, “నాకు అవగాహన అయింది' అని మీరు అంటారు