పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxxviii

కృష్ణమూర్తి తత్వం


ఆధ్యాత్మిక పరిణామవాదాన్ని ఖండిస్తూ చేసిన విమర్శను కృష్ణమూర్తి యింకా ముందుకు తీసుకొని వెళ్ళారు. ఆధ్యాత్మిక రంగంలో భూతల స్వర్గంలాంటి ఆదర్శాలకు చోటు వున్నదా అని ప్రశ్నించారు. 1933 లో తన శ్రోతలను ఆకాశాన్నంటే 'ఆదర్శాల' ను చిత్రించుకోవద్దని హెచ్చరించారు. ఆ విధంగా, భవిష్యత్తులో యింతకంటే వుత్తమంగా పరిణామం చెందాలనే వృధా ఆశలను పెట్టుకోవద్దనీ, తన బోధలను మరో ఆదర్శంగా చిత్రించుకొని, 'ఆ కొత్త ఆదర్శానికి తగినట్లుగా తనను తాను మలచుకోవాలి' అనే ప్రధమోత్సాహాపు ఆలోచనను నిరోధించుకోమనీ అర్ధించారు. ఆదర్శాలను చిత్రించుకోవడం సాధారణంగా మనసును మరపింపజూసే ఒక వుపాయం అనీ, యీ విధంగా మనసు బాధ్యతను ఎగవేసెయ్యాలని చూస్తుందని అతడికి తెలుసు.

“మీరు కారాగారంలో ఒక బందీ అవుతే, స్వేచ్ఛ అంటే ఏమిటి అని వర్ణించడంలో నేను ఆసక్తి చూపను. ప్రధానంగా నేను అప్పుడు చేసేది ఏమిటంటే ఆ కారాగారాన్ని తయారు చేసిందేమిటో చూపడం, ఆ కారాగారాన్ని పగలగొట్టడం మీ వంతు".

కారాగారాన్ని కూల్చి వేయడం అంటే ఎక్కువగా బాధతో కూడుకున్నటువంటిదే అయిన, ఎట్ట ఎదుటనే వున్న 'ఉన్నది' తో సూటిగా తలపడటం; ఎక్కడో దూరంగానూ, దాదాపు భ్రాంతి వంటిదీ అయిన 'ఉండవలసినది' ని చేజిక్కించుకోవాలనుకోవడం కాదు.

***

ప్రాచ్య తారక సంస్థను రద్దు చేశాక, యాభై అయిదు సంవత్సరాలు కృష్ణమూర్తి ప్రపంచంలోని నలుమూలలా తిరిగి, జీవితదర్శనం గురించి ప్రవచిస్తూ ప్రయాణించారు. ఈ కాలంలో అతడు స్థాపించిన ఫౌండేషన్లు అతని ప్రసంగాలను ఏర్పాటు చేయడం, అతని రచనలను ప్రచురించడం, విద్యాలయాలు నడిపించడం, అధ్యయనం, ధ్యానం చేయడానికి సౌకర్యాలు కల్పించడం చేస్తున్నాయి. ప్రతి వ్యక్తి బోధకుడే ప్రతీ వ్యక్తీ విద్యార్థే, అన్న తన మనోభావాన్ని అతడు చిత్తశుద్ధితో అమలు పరిచారు. అందుకే తనకు ఆధ్యాత్మిక వారసులు లేరన్నారు. ఇతరుల ధార్మికస్థాయిని నిర్ణయించే ఆధిపత్యాన్ని ఎవరికీ యివ్వలేదు.

తన బోధనలు ఒక కొత్త విద్యావిధానం నెలకొల్పడానికి ఆధారంగా వుంటాయని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. ఇండియా, యింగ్లాండు, అమెరికాలలో అనేక విద్యాలయాలను స్థాపించారు. ఈ పాఠశాలలన్నీ ప్రకృతి సౌందర్యంతో విలసిల్లుతున్న ప్రాంతాల్లో వున్నాయి. అవి ప్రకృతి మీద ప్రేమనూ, తోటి మానవులంటే అక్కరనూ,