Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృష్ణమూర్తి : వికాసోదయం

xxxvii

వుంటాడు. 'అన్వేషణ' అనే మరొక రచన కూడా కొంతవరకు ఆత్మకథలాగే వుంటుంది. అందులో మూడు పాత్రలు నేను, నీవు, లోకం మోక్షం కోసం ఆరాటపడుతుంటాయి. ఇందులోని ప్రధాన వస్తువు, రచనాశైలి తెలుసుకోవాలంటే 'జీవనగానం' అనే యీ కవితలో చూడచ్చు :

కాలవేదన వుచ్చులో చిక్కి
ఎదుగు ఎదుగు అన్న లోలోని ఒత్తిడికి అవిటినై
సంపూర్ణతే నీవు అయిన
ఓ ప్రియతమా
నీలో ఒక శకలమైన నేను
వెలుగులీనే మహదానందానికి
దారికోసం వెతుకుతున్నా

'సత్ ఆలోచన, సత్ కర్మలతో కూడిన ఒక జన్మ వృధా అయిన వేయి జన్మల కన్న మిన్న' అని 1925 లో ప్రకటించినప్పుడు, అల్సియన్ ని చివరకు సమాధి లో పూడ్చివేసినట్లుగా అనిపిస్తుంది. 1920 తరువాత ఆస్పష్టంగాను, ఛాందసంగాను వుండే ఆలోసియన్ మాటలు, వ్యక్తీకరణ మాయమై తోటి మానవుడి దుఃఖాన్ని కరుణతో కూడిన శ్రద్ధతో వింటున్న అసలైన బోధకుడు ఆ స్థానంలో నిలబడ్డాడు. తరువాత జగిగిన సమావేశాల్లో విశ్వజనీనమైన మానవ సమస్యలను గురించే చర్చించినా, ఒక విధమైన ప్రత్యేకత, అనన్యత్వం వాటిని ఆవరించేవి. అక్కడ పాల్గొనే వారి మధ్యన వున్న అడ్డుగోడలను ఒక అపారమైన నిశ్శబ్దం కరిగించి వేసేది. ఆ విధంగా కృష్ణమూర్తి చెప్పిన 'నీవే ప్రపంచం' అనే మాటలను రూఢి చేస్తూ.

పరిణతి చెందిన కృష్ణమూర్తి బోధలు 'నీవే నీకు ఒక దీపమై వెలుగు నిచ్చుకో మన్న బుద్దుని సూక్తికి ఒక కొత్త ప్రాణశక్తిని యిచ్చాయి. ఈ మాటల్లో మానవాళికంతటికీ ఒక సందేశం పొదిగి వున్నదని అతడు భావించాడు మీ జీవితాన్ని నడిపిస్తున్న ప్రతిదానినీ ప్రశ్నించండి : మీ గురించి మీరు ఏర్పరచుకున్న మనోబింబాన్ని పరీక్షించండి, మీ అపోహలను వదిలేయండి, మీ బాంధవ్యాలపై శ్రద్ధ చూపండి. ఇందులో వున్న అంతరార్ధాన్ని విప్పి చెప్పడానికి కృష్ణమూర్తి ఏ మాత్రం సంకోచించ లేదు- ఆధ్యాత్మిక జీవనంలో ఆధిపత్యం చలాయించడానికి ఎవ్వరికీ హక్కులేదు. మతగ్రంథాలకు లేదు, గురువులకు లేదు; ఆధ్యాత్మిక పురోభివృద్ధికి మధ్య వర్తులు లేరు, అధికార శ్రేణీ లేదు. ప్రతి మానవుడూ తన విముక్తిని కొత్తగా కని పెట్టవలసిందే. జగద్గురువు దారిని పోయే బాటసారి మాత్రమే.