Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxxiv

కృష్ణమూర్తి తత్వం

ప్రమాదకరంగా వున్నదని, ఆ తరువాత చనిపోయాడని తంతి ద్వారా వార్తలు వచ్చాయి. నిత్య ప్రాణాలకు భయం లేదనీ, అతను నిర్వర్తించవలసిన పనుల కోసం అతడు తప్పక బ్రతికి వుంటాడనీ నచ్చజెప్పిన తరువాతే కృష్ణమూర్తి స్వర్ణోత్సవాలలో పాల్గొనడానికి బయలుదేరాడు. అంతకు ఒక సంవత్సరం మునుపు ఒక స్వప్నంలో కృష్ణమూర్తి నిత్య ప్రాణాల కోసం అర్థించాడు. ఆ కలలో పరమగురువు మహా చొహాన్ 'అతను తప్పక బ్రతుకుతాడు' అని హామీ యిచ్చాడు. 1922 లో పొందిన మార్మికమైన అనుభూతులు సోదరులిద్దరినీ మరింత సన్నిహితంగా చేర్చాయి. ఇద్దరిదీ ఒకటే ఆశయంగా అనిపింపజేసింది. నిత్య విషయంలో తనకు కలలో లభించిన హామీ తప్పక నిజమవుతుందని కృష్ణమూర్తి అమాయకంగా ఆశించాడు. ఇప్పుడతనీ శోకానికి అవధులు లేకుండా పోయాయి. నిత్యవీ, అతనివీ ఒకటే అనుభవాలు, ఒకరంటే ఒకరికి సంపూర్ణమైన అవగాహన; అంత నిర్మలంగా, హాయిగా నిత్యను అతడు ప్రేమించాడు. బాల్యం నుండి వారి జీవితాలు పరస్పరం పెనవేసుకొని పోయాయి. తమ కుటుంబం నుంచి దూరం కావడం, తము పుట్టిన సంస్కృతిని వదులుకోవడం యిద్దరూ కలిసి అనుభవించారు. ఇద్దరూ కలిసి ఒక విజాతీయ వాతావరణానికి సర్డుకొని పోయారు. ఓడ మద్రాసు సమీపిస్తుండగా కృష్ణమూర్తి ఒక సందేశాత్మకమైన ప్రకటన వ్రాశారు. అందులో అమేయమైన దుఃఖం నిండి వుంది, ఆ దుఃఖాన్ని చల్లార్చడంలోనే ఇతనికి నూతన శక్తి లభించింది.

“పాత స్వప్నం ఒకటి మరణించింది. మరో కొత్తది జన్మిస్తున్నది. ఒక నూతన దర్శనం అవిర్భవిస్తున్నది, ఒక కొత్త చేతన వికసిస్తున్నది. నేను ఏడ్చాను, కాని మరెవ్వరూ శోకించకూడదని నేను కోరుకుంటున్నాను.”

నిత్య మరణంతో కృష్ణమూర్తిలో దివ్యజ్ఞాన సమాజం ఎడల విముఖత ఆరంభమైందని యీ విషాదపూరితమైన అడయారు ప్రయాణంలో కృష్ణమూర్తితో పాటు ప్రయాణించిన బి. శివరావు గట్టిగా భావించారు.

అతని జీవితతత్వం సమస్తం- శ్రీమతి బెసెంటు, శ్రీ లెడ్ బీటర్లు చిత్రించిన భవిష్యత్తులో అకుంఠితమైన విశ్వాసం, అందులో నిత్య ప్రధాన పాత్ర- అంతా భగ్నమై పోయింది.

నిత్య మరణం గుండెలు బ్రద్దలు చేసేలాంటి సంఘటన అని ఒప్పుకోవలసిందేఅది కొంతవరకు నిజమే- అయితే దివ్యజ్ఞానం ఎడల కృష్ణమూర్తిలో అసంతృప్తి కొన్ని సంవత్సరాలుగా మరుగుతునే వున్నది. నిత్య మరణం తరువాత హాలెండులో జరిగిన సంఘటనలు పరిస్థితిని ఒక విపత్కర స్థాయికి తీసుకొచ్చాయి. 1927 లో అతడు యిట్లా వ్రాస్తున్నాడు :