పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృష్ణమూర్తి : వికాసోదయం

xxxv

“నేను స్వంతంగా ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు- యిది గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే వున్నాను- నాలో ఒక తిరుగుబాటు చేలరేగింది. ఏ బోధలు కానీ, ఏ ఆధిపత్యం కానీ నాకు సంతృప్తిని యివ్వలేదు.”

నిత్య మరణానికి చాలా యేళ్ళకు పూర్వమే యీ తిరుగుబాటు ఆరంభమైంది. ఆధిపత్యం చలాయించడమంటే కృష్ణమూర్తిలో సహజంగానే వున్న రోత, దివ్యజ్ఞాన సమాజం (టీఎస్) లో ఆధ్యాత్మిక పురోభివృద్ధి విషయంలో సుస్థిరంగా పాతుకొనిపోయిన లేడ్ బీటర్ మధ్యవర్తి పాత్రా దానిని మరింత ఎగసన దోశాయి.

నిత్య మరణం వల్ల దివ్యజ్ఞానం ఎడల కృష్ణమూర్తిలో కలిగిన అసంతృప్తి స్పష్టంగా విదితమైంది. అడయారులో అందరి మధ్యా సంబంధ బాంధవ్యాలను బాగుపరిచి సరిచేయాలని అని బెసెంటు ప్రయత్నించింది. కృష్ణమూర్తి చేతులు పట్టుకొని లెడ్ బీటరును, అరండేలును, తక్కినవారిని ప్రధాన శిష్యగణంగా పరిగ్రహించ మని మళ్ళీ మళ్ళీ అభ్యర్థించింది. కృష్ణమూర్తి మళ్ళీ రెండోసారి నిరాకరించాడు. ఆ తరువాత పాత మర్రివృక్షం నీడన జరిగిన తారాసంస్థ సభలో ప్రసంగిస్తూ కృష్ణమూర్తి శ్రోతలతో “కావాలనుకున్న వారి కోసం, కోరుకున్నవారి కోసం కాంక్షించిన వారి కోసం మాత్రమే జగద్గురువు రాబోతున్నాడ” ని అన్నాడు.

“సానుభూతి కోరుకుంటున్న వారి కోసమూ, సంతోషం కావాలనుకుంటున్న వారి కోసమూ, విముక్తమవాలని కోరుకుంటున్నవారి కోసమూ, అన్నింటా సంతోషం కావాలనుకుంటున్నవారి కోసమూ... వస్తున్నాను తప్ప విచ్ఛిన్నం చేయడానికి కాదు, నిర్మించడానికి వస్తున్నాను.”

జగద్గురువు రాక విషయం కలిగించిన వుద్రేకోత్సాహాలలో శ్రోతలు అసలు విషయం పట్టించుకోలేదు. తను ఎట్టెదుట వున్న బోధకుడు హఠాత్తుగా కొత్త కొత్త ఆశయాలను ప్రకటిస్తున్నాడు; కొత్త శ్రోతల బృందాలను తయారుచేసుకోవాలని వుత్సాహంతో ఎదురుచూస్తున్నాడని కూడా వారికి తెలియదు. పాత తరానికి చెందిన దివ్యజ్ఞాన సామాజికులు 'మార్గం' లో తమ తమ నిర్దేశ స్థానాల్లో స్థిరంగా కూర్చొని వున్నారు; తమ గత జన్మల గురించీ, యితర లోకాల గురించీ సమాచారం తెలుసు కుంటూ వుండటం వారికి అలవాటై పోయింది. ఇప్పుడు కృష్ణమూర్తి యీ ప్రపంచానికి చెందిన, యీ ప్రస్తుత జీవితానికి చెందిన సమస్యల పై, విషయాల పై కేంద్రీకరించడమే తన పని అని గట్టిగా చెప్తున్నాడు. సమాధానాల కంటే సందేహాలను వెలిబుచ్చడమే ప్రధానం అంటున్నాడు. అసలు మూలంలోనే జరిగిన యీ మార్పుకు అతని శ్రోతలు సిద్దపడి లేరు.