196
కృష్ణమూర్తి తత్వం
చెందనని అన్నింటినీ వదిలేస్తాను. ఈ విధంగా అన్నింటినీ త్యజించడంలో నేను పూర్తిగా భద్రత పోగొట్టుకుంటాను. అటువంటి పరిత్యాగం మీకు తెలుసా? మీరు ఎప్పుడయినా ఏదయినా పరిత్యజించారా? ఆ రకంగా మీరు గతాన్ని త్యజించగలరా? భవిష్యత్తులో ఏముందో అన్న సంగతి తెలియకపోయినా త్యజించగలరా? మీకు తెలిసినదంతా పరిత్యజించగలరా?
అధ్యాపకుడు : నేను ఏదయినా పరిత్యజించినప్పుడు, వుదాహరణకి హిందూ మతాన్ని త్యజిస్తే, అప్పుడే అదే సమయంలో హిందూత్వం అంటే ఏమిటి అన్న అవగాహన కలుగుతుంది.
కృష్ణమూర్తి : మనం చర్చిస్తున్న అంశం ఏమిటంటే, ఒక నవ్యనూతనమైన మనస్సును తయారుచేయడం గురించీ, అది అసలు సాధ్యమేనా అనీ. కాలుష్యం వున్న మనసు కొత్తది అవలేదు. అందుకని మనసుని కాలుష్య రహితంగా చేయడమూ, అది సాధ్యమా కాదా అన్న విషయమూ మాట్లాడుకుంటున్నాం. ఆ సందర్భంగా పరిత్యజించడం అంటే ఏమిటి అని మిమ్మల్ని అడగడం ఆరంభించాను. ఎందుకంటే పరిత్యాగానికీ దానికీ చాలా దగ్గర సంబంధం వుంది. పరిత్యాగానికి నవ్యనూతనమైన మనసుతో చాలా సన్నిహిత సంబంధం వుంది. వెనకాల కారణాలు మిగల్చకుండా, ఏ ప్రయోజనాలూ ఆశించకుండా నేను శుభ్రంగా పరిత్యజించివేస్తే అది నిజమైన పరిత్యాగం అవుతుంది. అయితే, అది సాధ్యమేనా? చూడండి, యీ సమాజాన్ని - అంటే రాజకీయ, ఆర్థిక సూత్రాలతోను, సామాజికమైన సంబంధ బాంధవ్యాలతోను, ఆకాంక్షాపరత్వం, అత్యాశలతోను నిండిపోయి వున్న - యీ సమాజాన్ని కనుక నేను పూర్తిగా త్యజించకపోతే, నవ్యనూతనమైన మనసు వుండటం అంటే ఏమిటో కని పెట్టడం నాకు సాధ్యం కాదు. కాబట్టి పునాదులను పగలగొట్టడంలో మొదటిది ఏమిటంటే నాకు తెలిసిన విషయాలన్నింటినీ పరిత్యజించడం, అది సాధ్యమేనా?
మాదక ద్రవ్యాల వలన నవ్యనూతనమైన మనసు కలగదని నిస్సందేహంగా చెప్పచ్చు. గతం అంతటినీ మొత్తంగా పరిత్యజించడం అన్న ఒక్కటి తప్ప మరేది దానిని కలిగించలేదు. అది చేయగలమా? ఏమంటారు? అటువంటి పరిత్యాగంలోని పరిమళాన్ని, ఆ దృష్టిని, ఆ రుచిని నేను చవిచూశాక, విద్యార్థికి అది చెప్పకుండా వుండగలనా? అది విద్యార్థికి ఎట్లా అందజేయాలి? అతను గణితమూ, భూగోళశాస్త్రం, చరిత్ర - యివన్నీ బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అయితే, అంత క్షుణ్ణంగానూ తెలిసిన వాటిని వదిలివేయాలి. ఏమాత్రం పరితాప పడకుండా వదిలివేయాలి.