పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంభాషణలూ, సంవాదాలు

187

కాకుండా, క్షణ క్షణపు బాంధవ్యంలో మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. దీని అర్థం ఏమిటంటే, యదార్థంగా యిప్పుడు జరుగుతున్నది ఏమిటో దాని ఎడల, మన యిష్టాయిష్టాలతో ప్రసక్తి లేని ఎరుక వుండాలి. అంటే ఏమిటంటే మనం ఏమిటో దానినే చూడటం. దానికి వ్యతిరేకమైనదిగానీ, ఒక ఆదర్శం గానీ, ఒకప్పుడు మనం ఏమిటో ఆ సమాచారం గానీ లేకుండా చూడటం. మీవైపు మీరు ఆగ్రహంతోనో, ద్వేషంతోనో కూడుకున్న దృష్టితో చూసుకుంటే గతించిన కాలం పులిమిన ఛాయల్లోనే మీరు కనబడతారు. మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడల్లా గతాన్ని వదిలివేస్తూ వుండటమే గతంనుంచి విముక్తి చెందడం. అవగాహన అనే కాంతి వున్నప్పుడే దుఃఖం అంతమవుతుంది. అయితే యీ కాంతి ఏదో ఒక ఆనుభవం వల్ల వెలగదు; మెరుపు లాంటి ఒక అవగాహనవల్లా రాదు. ఈ అవగాహన ఎల్లవేళలా తనని తాను వెలిగించు కుంటూ వుంటుంది. ఇంకొకరు ఎవరో మీకు దీనిని యివ్వలేరు - గ్రంధం కానీ, తంత్రం కానీ, బోధకుడు కానీ, లోక రక్షకుడు కానీ - ఎవ్వరూ యివ్వలేరు. మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోవడమే దుఃఖాన్ని సమాప్తం చేయడం.

(ది అర్జెన్సీ ఆఫ్ ఛేంజ్)


పారమార్థిక జీవనం

ప్రశ్నిస్తున్నవారు : పారమార్థిక జీవనం అంటే ఏమిటో నాకు తెలుసుకోవాలని వుంది. కొన్ని నెలల తరబడి ఆశ్రమాలలో నివసించాను. ధ్యానం చేశాను. క్రమశిక్షణా బద్దమైన జీవితం అనుసరించాను. ఎంతో చదివాను. అన్ని రకాలైన దేవాలయాలకు, చర్చీలకు, మసీదులకు వెళ్ళి చూశాను. నిరాడంబరంగా వుండే సాధుజీవనం గడపడానికి, మనుష్యులకు గాని, జంతువులకు గాని ఏమాత్రం హాని కలిగించకుండా బ్రతకడానికి ప్రయత్నించాను. పారమార్థిక జీవనం అంటే యింతేనంటారా? యోగాభ్యాసం చేశాను. 'జెన్' అధ్యయనం చేశాను. ఎన్నో మతాలకు చెందిన పద్ధతులను అనుసరించాను. ఇప్పుడూ, మొదట్లోనూ ఎప్పుడూ నేను శాకాహారినే. నాకు వృద్ధాప్యం సమీపిస్తున్నదని మీరు గమనించే వుంటారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో వున్న ఎందరో సాధుపుంగవులతో పాటు కలిసి నివసించాను. కాని యిదంతా అసలైనదాని అంచులను కూడా తాకకుండా బయటే వుండిపోయిందని నాకు ఎందుచేతనో అనిపిస్తున్నది. అందుకని, మీ దృష్టిలో పారమార్థిక జీవనం అంటే ఏమిటో అది చర్చిస్తే బాగుండుననిపిస్తున్నది.