Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

కృష్ణమూర్తి తత్వం


కృష్ణమూర్తి : ఒకరోజు సన్యాసి ఒకరు నన్ను కలవడానికి వచ్చారు. చాలా దిగులు పడుతున్నట్లుగా కనిపించారు. ఆయన బ్రహ్మచర్యవ్రతం చేపట్టారుట. సన్యాసం పుచ్చుకొని వూరూరా తిరుగుతూ భిక్షాటనతో కాలం గడుపుతున్నారు. అయితే, తనలో కలిగిన శరీరవాంఛల ధాటికి తట్టుకోలేక, ఒకరోజు తన మర్మావయవాలను శస్త్రచికిత్సకుని సహాయంతో తొలగించుకున్నారు. నెలల తరబడి వేధించిన ఆ నొప్పిని భరించారు. ఏదో విధంగా అదంతా నయమైపోయింది. చాలా యేళ్ళు గడిచాక తాను చేసిన పని ఏమిటో గ్రహింపుకి వచ్చింది. అందుకని నన్ను కలవడానికి వచ్చారు. ఆ చిన్నగదిలో కూర్చున్నాం; యీ విధంగా అంగవిచ్ఛేదం చేసుకున్నాననీ, మళ్ళీ మామూలుగా అవడానికి - అంటే శారీరకంగా కాదు, అంతర్గతంగా - ఏం చేయాలనీ అడిగారు. ఇదంతా ఆయన ఎందుకు చేశారంటే ధార్మిక జీవనానికి సెక్స్ సంబంధమైన కార్యకలాపాలు పనికిరావని అంటారు కాబట్టి. సెక్స్ అంటే చాలా ఐహిక విషయమూ, సుఖలోలత్వానికి సంబంధించినదీ, నిజమైన సన్యాసి వాటి దరిదాపులకు కూడా పోగూడదనీ అంటుంటారు. నన్ను చూడండి నా మనుషత్వమే పోగొట్టుకొని ఆయోమయంలో పడిపోయాను. నాలోని కామవాంఛలను నిరోధించాలని, అణచి వేయాలని సకల ప్రయత్నాలు చేశాను. చివరికది యింత దారుణంగా పరిణమించింది. ఇప్పుడిక నేనేం చేయాలి? నేను చేసింది తప్పనీ నాకు తెలుసు. నాలోని శక్తి అంతా దాదాపుగా అణగారిపోయింది. ఇక అంధకారంలోనే జీవితం ముగిసిపోయేటట్లుగా వుంది,' అని ఆయన అన్నారు. నా చేతిని పట్టుకొని కొంతసేపు కూర్చున్నారు. ఇద్దరం నిశ్శబ్దంగా వుండిపోయాం.

ఇది పారమార్థిక జీవనమా? పారమార్థిక జీవితం గడపడానికి సుఖాన్నీ, సౌందర్యాన్నీ త్యజించడం ఒక మార్గమా? ఆకాశంలోను, కొండలలోను, మనిషి రూపురేఖల్లోనూ వున్న సౌందర్యాన్ని కాలద్రన్నడం ద్వారా పారమార్థిక జీవనాన్ని చేరుకోగలమా? అయితే చాలామంది మహాత్ములు, సన్యాసులు దీన్నే నిజమని నమ్ముతున్నారు. ఈ నమ్మకంతో తమని తాము చిత్రహింస చేసుకుంటున్నారు. చిత్రహింసలకు లోనై, వికలమైపోయిన మనసు పారమార్థిక జీవనం అంటే ఏమిటో తెలుసుకోగలుగుతుందా? అయితే పరమసత్యాన్ని లేదా దైవాన్ని లేదా వీళ్ళు పెట్టిన మరో పేరు ఏదయినా సరే దానిని చేరుకోవాలంటే యీ చిత్రహింస, యీ వక్రత్వం తప్ప మరో మార్గం లేదని అన్నీ మతాలూ నొక్కి చెప్తున్నాయి. ఆధ్యాత్మిక లేదా పారమార్థిక జీవనం అని వాళ్ళు పేరు పెట్టిన దానికి, ప్రాపంచిక లేదా ఐహిక జీవనం అని వాళ్ళే అంటున్న దానికీ చాలా అంతరం వుందని వాళ్ళు అంటారు.