Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

కృష్ణమూర్తి తత్వం


కృ : దుఃఖంలో వున్న ప్రధానాంశాల్లో ఒకటి తన మీద తనే జాలిపడటం, మరొక వ్యక్తితో అనుబంధం పెంచుకోవడం; ఆ వ్యక్తి తిరిగి మనతో అనుబంధం పెంచుకోవడాన్ని ప్రోత్సహించి, పెంపు చేయడం రెండవది. దుఃఖం కలిగేది యీ అనుబంధం సడలిపోయినప్పుడే. కాని దుఃఖపు బీజాలు మాత్రం అనుబంధపు ఆరంభదశలోనే పడతాయి. దీనంతటికీ కారణం ఏమిటంటే మనల్ని గురించిన జ్ఞానం మనకు బొత్తిగా లేకపోవడం, తనని తాను తెలుసుకోవడమే దుఃఖాన్ని ఆంతం చేయడం. మనల్ని గురించి తెలుసుకోవాలంటే మనకు భయం. ఎందుకంటే అందరినీ మంచివాళ్ళు - చెడ్డవాళ్ళు, దుర్మార్గులు - మహాత్ములూ, నిష్కళంకులు- అవినీతి పరులూ అని మనమే విభజించి కూర్చున్నాం. చెడుని గురించి మంచి ఎప్పుడూ తీర్పులు యిస్తూ వుంటుంది. ఈ వేరు వేరు పక్షాలు ఒకదానితో ఒకటి కలహిస్తూ వుంటాయి. ఈ కలహమే దుఃఖం. దుఃఖాన్ని అంతం చేయడం అంటే యీ వాస్తవాన్ని చూడటం. దానికి వ్యతిరేకమైనది కని పెట్టడం కాదు. ఎందుకంటే పరస్పర వ్యతిరేకాలలో (ద్వంద్వాలలో) ప్రతిదానిలోనూ రెండోది కూడా వుంటుంది. ఈ ద్వంద్వాలను పట్టుకొని నడవడమే దుఃఖం. జీవితాన్ని యీ విధంగా వున్నతమూ నీచమూ, మహోత్తమం - ఆతిక్షుద్రం, దేవుడు - దయ్యమూ అనే పక్షాలుగా ముక్కలు చేయడంవల్ల సంఘర్షణ, బాధ పుట్టి పెరుగుతాయి. దుఃఖం వున్నప్పుడు ప్రేమ వుండదు. ప్రేమ, దుఃఖం రెండూ కలిసి ఒకేచోట వుండలేవు.

ప్ర : అహా! ప్రేమను ఎదుటివారిని దు:ఖంలో ముంచగలదు. నేను ఒకరిని ప్రేమిస్తుండవచ్చు, అయినా వారికి దుఃఖాన్ని కూడా కలిగించవచ్చు.

కృ: మీరు ఒకరిరిని ప్రేమిస్తున్నప్పుడు, దుఃఖాన్ని మీరు యిస్తున్నారా, అవతలి వ్యక్తి కలిగించుకుంటున్నారా? ఒక వ్యక్తి మీతో అనుబంధం పెంచుకున్నాడనుకుందాం. మీరు దానిని ప్రోత్సహించిన సరే, ప్రోత్సహించకపోయినా సరే అతను పెంచుకున్నాడు. మీరు అతని నుంచి దూరంగా తొలగిపోయారు. అతను బాధపడతాడు. అతను పడుతున్న బాధకు కారణం మీరా, ఆతనా?

ప్ర : మరొకరి దుఃఖానికి బాధ్యత -,ఆ దుఃఖం నాకోసం అయినా సరే - ఆ బాధ్యత నాది కాదని మీరంటున్నారా? అప్పుడు మరి దుఃఖం ఎట్లా అంతమవుతుంది?

కృ : మేము చెప్పినట్లుగా, తనని తాను పూర్తిగా తెలుసుకోవడంలో మాత్రమే దుఃఖం అంతమవుతుంది. ఒకే ఒక్క చూపుతోనే మిమ్మల్ని మీరు తెలుసుకుంటారా లేదూ బహుశా, దీర్ఘమైన విశ్లేషణ అనంతరం - అంటారా? విశ్లేషణ ద్వారా మిమ్మల్ని మీరు తెలుసుకోలేరు. పరస్పర సంబంధాలలో, కూడబెట్టి నిలవ చేసుకోవడంవల్ల