182
కృష్ణమూర్తి తత్వం
ప్ర : నాలోనుంచి ఆ మాటను తీసిపారేయమని మీరంటున్నారు. అదెట్లా సాధ్యం? ఆ మాటలో గతం వుంది. జ్ఞాపకాలు వున్నాయి.. భార్య అంటే ఒక మాట. యిల్లు అన్నా ఒక మాటే. సృష్టి ఒక మాటతో ఆరంభమైంది. అంతే కాకుండా మాట ద్వారానే భావప్రసారం జరుగుతుంది. మాట ఒక గుర్తుగా పనిచేస్తుంది. మీరు అంటే మీ పేరు కాదు. అయినా కూడా మిమ్మల్ని గురించి నేను తెలుసుకోవాలంటే మీ పేరు పెట్టి అడగాలి. మీరేమో మనసు యీ మాటను వదిలించుకోగలదా, అంటే మనసు తాను చేసే పనులన్నింటినీ తానే ఆపివేయగలదా అని అడుగుతున్నారు.
కృ: చెట్టు అనే విషయం తీసుకుందాం. అందులో వస్తువు మన కళ్ళ ముందు వుంటుంది. ఆ మాట చెట్టుని గురించి అని అందరూ ఒక ఒప్పందానికి వచ్చారు. ఇప్పుడు 'దేవుడు' అనే మాట తీసుకుంటే, ఆ మాటకు సంబంధించినది ఏదీ లేదు. అందువల్ల ప్రతివారూ తమకు తోచిన వూహాచిత్రాన్ని సృష్టించుకుంటున్నారు. ఎందుకంటే ఆ మాటకు సంబంధించినది ఏదీ లేదు కాబట్టి. ఇది వేదాంతి ఒక రకంగానూ, మేధావి మరో రకంగాను సృష్టించుకుంటాడు. నమ్మకం వున్నవాడు, నమ్మకం లేనివాడు కూడా తమకు నచ్చిన పద్ధతుల్లో తయారుచేసుకుంటారు. ఆశలోనే యీ నమ్మకం పుట్టి, ఆపైన వెంపర్లాట ఆరంభమవుతుంది. ఆ ఆశ అసలు నిస్పృహ యొక్క -: అంటే లోకంలో మన చుట్టూరా వున్నదంతా చూడటంవల్ల కలిగిన నిస్పృహ యొక్క పర్యవసానం. నిస్పృహలో నుంచే ఆశ పుడుతున్నది. ఇవి రెండూ కూడా ఒకే నాణేనికి వున్న రెండు ప్రక్కలు, ఏ ఆశా లేనప్పుడు అది నరకమే. నరకం అంటే భయం కాబట్టి మనం ఆశకి ప్రాణం పోస్తాం. అప్పుడు భ్రాంతి ఆరంభమవుతుంది. కాబట్టి, ఆ మాట మనల్ని భ్రాంతిలో పడవేసిందే తప్ప దేవుడి దగ్గరకు మాత్రం చేర్చలేదు. దేవుడు అంటే భ్రాంతి. ఆ భ్రాంతిని మనం పూజిస్తున్నాం. ఇక అవిశ్వాసి యింకోరకం దేవుడిని గురించి ఒక భ్రాంతిని సృష్టించుకొని, దాన్ని పూజిస్తాడు. అదే తన దేశం లేదా ఒక భూలోకస్వర్గం లేదా సత్యం మొత్తం అందులోనే వుందని అతను అనుకునే ఒక గ్రంధం. అందువల్ల యీ భ్రాంతితో కూడుకున్న ఆ మాటను మీరు వదిలేయగలరా అని అడుగుతున్నాము.
ప్ర : ఈ విషయమై నేను బాగా యోచించాలి.
కృ : భ్రాంతి లేనప్పుడు, యిక మిగిలింది ఏమిటి?
ప్ర : ఉన్నది ఏదో అది మాత్రమే
కృ: ఆ 'వున్నది' అత్యంత పవిత్రమైనది