పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంభాషణలూ, సంవాదాలు

183


ప్ర : 'ఉన్నది' కనుక అత్యంత పవిత్రమైనదయితే, అప్పుడు యుద్ధం అతిపవిత్రమైనది; ద్వేషం, అస్తవ్యస్తత, బాధ, దురాశ, దోపిడీ యివన్నీ పవిత్రమైనవి. అప్పుడు మనం మార్పు గురించి ఏమీ మాట్లాడ కూడదు. 'ఉన్నది' కనుక పవిత్రమైనదయితే, అప్పుడు ప్రతి హంతకుడు, దోపిడీ చేసే ప్రతివాడూ, స్వలాభానికి యితర్లనీ వుపయోగించుకునే వాడూ, అందరూ 'నన్ను ఏమీ అనకండి, నేను చేస్తున్నది పవిత్రమైన పని' అని అనవచ్చు.

కృ : 'ఉన్నది' అత్యంత పవిత్రమైనది అన్న వాక్యంలోని సరళత్వమే దాన్ని చాలా అపార్థం చేసుకోవడానికి దారి తీస్తున్నది. ఎందుకంటే మనం అందులోని సత్యాన్ని చూడం. 'ఉన్నది' పవిత్రమైనది అని నిజంగా గ్రహించినప్పుడు, మీరు యుద్ధమూ చేయరు, ఆశలూ పెంచుకోరు, యితర్లని దోపిడీలూ చేయరు. ఇవన్నీ చేశాక, మీరు వుల్లంఘించిన ఆ సత్యమే మళ్ళీ మిమ్మల్ని రక్షించాలని మీరు కోరుకోవడానికి వీల్లేదు. వీధుల్లో హింసాకాండ చేస్తున్న నల్లవాడితో, “ఉన్నది చాలా పవిత్రమైనది, దానిని ఎదిరించకు, దానిని మంటబెట్టకు” అంటున్న శ్వేత జాతీయుడు 'వున్నది' ని గ్రహించలేదనమాట. ఎందుకంటే నిజంగా అతడు గ్రహించి వుంటే అతనికి ఈ నీగ్రో పవిత్రంగా కనబడి వుండేవాడు. అప్పుడు యీ విధ్వంసానికి ఆస్కారమే వుండేది కాదు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ యీ సత్యాన్ని చూస్తే, మార్పు తప్పక కలుగుతుంది. సత్యాన్ని గ్రహించడమే మార్పు.

ప్ర: దేవుడున్నాడా లేదా అన్నది తెలుసుకోవడానికి నేను యిక్కడికి వచ్చాను. మీరు నన్ను పూర్తిగా గందరగోళంలో పడేశారు.

కృ: దేవుడున్నాడా అన్నది అడగడానికి మీరు వచ్చారు. ఆ మాట భ్రాంతికి దారితీస్తున్నది; ఆ భ్రాంతిని మీరు పూజిస్తున్నారు; ఈ భ్రాంతికోసంగాను ఒకరినొకరం హతమార్చుకోవడానికి మనకు ఏ అభ్యంతరమూ వుండటం లేదు. ఏ భ్రాంతులూ లేనప్పుడు 'వున్నది' అత్యంత పవిత్రమైనది. అసలు యదార్థంగా వున్నదేమిటో యిప్పుడు చూద్దాం. మనం తీసుకున్న ఒక క్షణంలో 'వున్నది' భయం కావచ్చు, తళుక్కున మెరిసి మాయమయే పుల్లాసం కావచ్చు. ఇవన్నీ నిరంతరం మారిపోతూనే వుంటాయి. ఇవి కాక, 'నా చుట్టూరా యివన్నీ మారిపోతూ వుంటాయి. కానీ నేను శాశ్వతంగా వుండిపోతాను' అని అంటున్న పరిశీలకుడు కూడా వున్నాడు. అది వాస్తవమేనా, అది నిజంగా అట్లా వున్నదా? అతను కూడా మార్పు చెందడం లేదూ? కొంత తనలో చేర్చుకుంటూ, కొంత తననుంచి తొలగించుకుంటూ, రూపం మార్చుకుంటూ, సర్దుబాటు చేసుకుంటూ, మరొకలాగా అవుతూనో, అవకుండానో - ఆతను మారడం లేదూ? కాబట్టి పరిశీలిస్తున్న అంశమూ, పరిశీలకుడూ రెండూ