Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

కృష్ణమూర్తి తత్వం

వున్నది. దీనినుంచి తప్పించుకోవాలని మీరు ప్రయత్నించవచ్చు. అయితే ఆ కదలిక కూడా స్వార్థం చేస్తున్న చర్యే. నిర్దుష్టమైన గ్రహణశీలత వుండటమే స్వార్ధం నుంచి విముక్తి చెందడం.

('లెటర్స్ టు ది స్కూల్')


మహత్వపూర్ణమైన అనుగ్రహం

ఇవాళ తెల్లవారుఝామున ఆకాశంకేసి చూస్తే ఒక్క మబ్బు తునక కూడా కనబడలేదు. బూడిదరంగులో వున్న ఆలివుచెట్లతోను, దట్టంగా వున్న సైప్రస్ చెట్లతోను నిండివున్న టస్కన్ కొండల వెనకాలనుంచి సూర్యుడు వుదయిస్తున్నాడు. నది మీద ఒక్క నీడ కూడా పడటంలేదు. ఏస్పెన్ చెట్ల ఆకులు నిశ్చలంగా వున్నాయి. ఇంకా వలసపోని పక్షులు కొన్ని కిలకిలరావాలు చేస్తున్నాయి. నది చలనరహితంగా నిలబడిపోయినట్లు కనిపిస్తున్నది. నది వెనకాలనుంచి సూర్యుడు పైకెక్కి వస్తుంటే, ప్రశాంతంగా వున్న నీటిమీద పొడవాటి నీడలు పరచుకుంటున్నాయి. అంతలో ఒక పిల్లగాలి తెర కొండలపై నుంచి వచ్చి లోయలో ప్రవేశించింది. అది ఆకుల మధ్యలో దూరి, వుదయ సూర్యుని కిరణాలు సోకిన ఆ ఆకులను వణికించి నృత్యం చేయిస్తున్నది. మట్టిరంగులో వుండి, మిల మిల లాడుతున్న నీటి పై పొడవైనవీ, పొట్టివీ, పెద్దవీ, చిన్నవీ నీడలు పడుతున్నాయి. ఒంటరిగా కనబడుతున్న ఒకే ఒక పొగగొట్టంలోనుంచి పొగ పైకి లేస్తున్నది. బూడిదరంగు పొగలు చెట్లను దాటుకొని వెళుతున్నాయి. ఈ వుదయం చాలా మనోహరంగా వుంది. సౌందర్యంతో నిండి ఎంతో సమ్మోహపరుస్తూ వుంది. ఎక్కడ చూసినా నీడలు, తట తట మని వణికిపోతూ ఎన్నో ఆకులు. గాలిలో ఏదో సుగంధం తేలి వస్తున్నది. శీతకాలపు ఎండ కాస్తున్నా, వసంతఋతువు తొంగి చూస్తున్నట్లుగా అనిపిస్తున్నది కర్ణకఠోరమైన చప్పుడు చేస్తూ చిన్నకారు ఒకటి కొండపైకి వెళ్తున్నది. వేలాది నీడలు మాత్రం నిశ్చలంగా నిలబడిపోయి వున్నాయి. చాలా చక్కని వుదయం అది.

నిన్న మధ్యాహ్నం, గోల గోలగా వున్న వీధిని అంటుకొని వున్న ఒక గదిలో హరాత్తుగా ఆరంభమైంది. పరతత్వపు శక్తీ, సౌందర్యం ఆ గదిలో నుంచి బయటకు వెలువడి, వీధిలో వస్తూ పోతూ వున్న జనం మీదుగా, తోటల మీదుగా, కొండలు దాటుకొని వ్యాపిస్తూ పోయింది. అపారంగా, అభేద్యంగా అది అక్కడ వుండిపోయింది. ఆ మధ్యాహ్నం అది అక్కడే వున్నది. మంచంమీద పడుకోబోతు వుంటే యింకా