Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దినచర్య వృత్తాంతాలు, లేఖకులకు చెప్పి వ్రాయించినవి, ఉత్తరాలు

177

విపరీతమైన తీక్షణత్వాన్ని సంతరించుకుని, వుండిపోయింది. మహాత్వపూర్ణమైన అనుగ్రహం అది. దానికి అలవాటు పడిపోవడం జరుగదు. ఎందుకంటే ప్రతిసారీ అది భిన్నంగా వుంటుంది. ప్రతిసారీ కొత్తగా, ఒక నవ్యత్వంతో, చాలా సున్నితమైన విశిష్టతతో, ఒక కొత్త వెలుగుతో వుండి, అంతకు మునుపు ఎన్నడూ చూడని దానిలాగా వుటుంది. అది దాచుకునే వస్తువు కాదు. జ్ఞాపకం పెట్టుకొని, ఆ తరువాత ఎప్పుడో తీరిగ్గా కూర్చుని పరీక్షించే సంగతి కాదు. అది అక్కడ వుంటుంది; అయితే ఆలోచన దానిని సమీపించలేదు. ఎందుకంటే అసలు మెదడే పనిచేయడం ఆగిపోతుంది. అనుభవం పొందడానికీ, దాచుకోవడానికి అప్పుడు కాలం అక్కడ వుండదు. అది అక్కడ వున్నది; ఆలోచనలన్నీ ఆగిపోయాయి.

ఆ తీక్షణమైన జీవశక్తి ఎప్పుడు, రాత్రింబగళ్ళూ వుంటుంది. అది ఘర్షణ ఎరగదు; ఒక గమ్యం వైపుగా వుండదు; మన ప్రయత్నం, యిష్టాయిష్టాల ప్రమేయం దానికి అవసరం లేదు. ఎంత తీక్షణత్వంతో వుంటుందంటే ఆలోచనలు, మనోభావాలు దానిని తమ యిచ్చలకు, నమ్మకాలకు, అనుభవాలకు, కోరికలకు అనుగుణంగా మలచుకోవడం కోసం దానిని పట్టి బంధించలేవు. అది ఎంత పుష్కలంగా వుంటుం దంటే దేనివల్లా కూడా అది తగ్గిపోవడం జరుగదు. అయితే, దానిని మనం వుపయోగించుకోవాలనీ, ఒక గమ్యంవైపు మళ్ళించాలనీ, మన అస్తిత్వం అనే మూసలో దానిని పట్టి బంధించాలనీ, ఆవిధంగా మన పద్ధతులకు, మన అనుభవాలకు, మన జ్ఞానానికి లోబడేటట్లుగా దానిని తిప్పుకోవాలనీ ప్రయత్నిస్తాం. ఆకాంక్ష, అసూయ, అత్యాశ అనే వాటివల్ల ఆ శక్తి సన్నగిల్లుతుంది. ఆ కారణంగా సంఘర్షణ, దుఃఖం కలుగుతాయి. వ్యక్తిగతమైన ఆకాంక్షల్లో కాని సామూహిక ఆకాంక్షల్లో కాని వుండే నిర్దాక్షిణ్యత దాని తీక్షణతను చెదిరిపోయేటట్లు చేస్తుంది. అందువల్ల ద్వేషం, విరోధం, సంఘర్షణ కలుగుతాయి. అసూయతో కూడుకున్న చర్యలు యీ శక్తిని వక్రంగా తయారుచేస్తాయి. దానివల్ల అసంతృప్తి, వేదన, భయం వుత్పన్నమవుతాయి. భయంతో పాటుగా అపరాధభావం, ఆందోళన బయల్దేరుతాయి. ఆ పైన పోల్చిచూడటం, అనుకరణ అనే నిరంతర క్షోభ ఆరంభమవుతుంది. వక్రమైపోయిన యీ ప్రాణ శక్తే మతాచార్యుడినీ, సైనికాధికారినీ, రాజకీయవాదినీ, దొంగనీ తయరుచేస్తుంది. శాశ్వతత్వం కోసం, భద్రత కోసం మనం కోరుకోవడం యీ పరిమితులు లేని ప్రాణశక్తిని అసంపూర్ణంగా వుంచుతుంది. అందుకే అది నిష్ఫలమైన భావాలకు, పోటీలకు, క్రూరత్వానికి, యుద్ధాలకు నిలయమవుతున్నది. మనిషికీ, మనిషికీ మధ్య నిరంతర సంఘర్షణకు కారణమవుతున్నది.