Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దినచర్య వృత్తాంతాలు, లేఖకులకు చెప్పి వ్రాయించినవి, ఉత్తరాలు

171

వల్ల నిగ్రహించుకోవడంవల్ల చాలా దుష్పలితాలు కలిగి రకరకాల మానసిక రుగ్మతలకు దారితీస్తాయనీ చేస్తున్నప్పుడు - సహజంగానే మీరు యింకా ఎక్కువెక్కువగా క్రీడారంగం లోను, వినోదాలతోను, కాలక్షేపాలలోను మునిగి తేలుతూ వుంటారు. ఇవన్నీ మీనుంచి, అసలు మీరు ఏమిటో దానినుంచి మీరు పారిపోవడానికి సహాయం చేస్తుంటాయి.

మీరు ఏమిటి అన్నదాని స్వభావాన్ని ఏ విపరీతార్థాలూ కల్పించకుండా, ఏ పక్షపాతాలకూ తావులేకుండా, మీరంటే యిదీ అని కనిపెట్టాక, దానిని చూసి ఎటూ చలించకుండా, దానిని అవగాహన చేసుకోవడమే నిరాడంబరతకు ఆరంభం. ప్రతి ఆలోచననూ, ప్రతీ మనోభావాన్నీ కనిపెట్టే వుండటం, ఆ ఎరుక కలిగి వుండటం, వాటిని అదుపు చేయకుండా, నిరోధించకుండా, మీ స్వంత అర్థాలను, ఆపోహాలను జోడించకుండా ఎగురుతున్న పక్షిని గమనిస్తున్నట్లుగా గమనించాలి. ఈ విధంగా గమనించడం వలన ఒక అసాధారణమైన నిరాడంబరతత్వం కలుగుతుంది. మనకి మనం విధించుకునే నిబంధనలకంటే, మనమీద మనం చేసుకునే రకరకాల మూర్ఖపు ప్రయోగాల కంటే, స్వీయ వున్నతి అనీ, స్వీయ సాఫల్యం అనీ మనం అనుకునే వాటన్నింటికంటే మించిపోయి వుంటుంది యిదీ. అసలు అవన్నీ పరిణతిలేనివారు చేసే చేష్టలు. ఈ విధమైన గమనించడంలో గొప్ప స్వేచ్ఛ వుంటుంది. ఆ స్వేచ్ఛలో నిరాడంబరతత్వం అనే వుదాత్త భావం వుంటుంది. ఈనవనాగరిక ప్రపంచానికి చెందిన విద్యార్థులతో, చిన్నపిల్లలతో యిదంతా మాట్లాడితే వాళ్ళకు బహుశ విసుగొచ్చి తలకాయలు యింకోవైపుకి తిప్పేసుకుంటారు. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచం తనకి కావలసిన సుఖసంతోషాలని వెతుక్కోవడంలో పూర్తిగా మునిగిపోయి వుంది.

గోధుమరంగులో వున్న పెద్ద వుడుత ఒకటి చెట్టు పైనుంచి దిగి వచ్చి, ఆహారపు తొట్టెవద్దకు వచ్చింది. నాలుగు గింజలు నోట కరచుకొని తొట్టె అంచుమీద కూర్చుంది. తోక నిటారుగా నిలబెట్టి, చివర మాత్రం మెలి త్రిప్పి, పెద్ద పెద్ద గాజు పూసల్లాంటి కళ్ళతో నాలుగువైపులా చూస్తూ ఎంతో ముచ్చటగా వుంది అది. ఒక నిముషం సేపు అట్లా కూర్చుందో లేదో మళ్ళీ తొట్టె కిందికి దిగి వచ్చింది. చెదరు మదరుగా వున్న రాళ్ళమీద గెంతుకుంటూ పోయి, చటుక్కున చెట్టుమీదకెక్కి, అదృశ్యమైపోయింది.

మానవుడు తననుంచి, తను ఏమిటో దానినుంచి, తను ఎక్కడికి పోతున్నాడో దానినుంచి, అసలు యిదంతా దేనిగురించో దానినుంచి అంటే - యీ విశాల విశ్వం, మన దైనందిన జీవనం, చనిపోవడం, ఆరంభం అనే వాటినుంచి ఎప్పుడూ పారిపోతున్నట్లుగా కనబడుతున్నది. మననుంచి మనం ఎంతగా పారిపోయినా సరే, తెలిసి బుద్ధి పూర్వకంగా గాని, మనకు తెలియకుండానే గాని, యింకా పైకి కనబడని సూక్ష్మ పద్ధతిలో గాని, మనం ఎంత దూరంగా తప్పించుకొని వెళ్ళిపోయినా సంఘర్షణ,