xxii
కృష్ణమూర్తి తత్వం
లెడ్ బీటరు యీ బాలురిద్దరినీ గూఢమైన రహస్య సాధనకు చెందిన కార్యకలాపాల్లో పూర్తిగా మునిగించి, తమ కుటుంబానికీ, తమ సంస్కృతికీ దూరంగా లోక్కుని వెళ్ళిపోవడం నారాయణయ్య వ్యతిరేకించాడు. కొన్ని సంవత్సరాల క్రితం లెడ్ బీటరు కొని అవకృత్యాలు చేసి, నిందలకు గురికావడం అందరికీ తెలిసిన విషయమే. దరిమిలా రేగిన ఘాటు విమర్శల వల్ల అతడు దివ్యజ్ఞాన సమాజ సభ్యత్వానికి కొంతకాలం పాటు రాజీనామా యివ్వవలసి వచ్చింది. మద్రాసులోని సనాతనవాదులు కొందరి సహాయంతో నారాయణయ్య శ్రీమతి బెసెంటుమీద దావా వేశాడు. ఆవిడ తనతో చేసుకున్న ఒప్పందాన్ని అతిక్రమించి, పిల్లల్ని మళ్ళీ లెడ్ బీటర్ శిష్యత్వంలో పడవేసిందనీ, ఆ పాత విషయాలన్నీ తిరగతోడి, ఆరోపణలు చేస్తూ వ్యాజ్యం వేశాడు. తన పిల్లల సంరక్షణ భారం తిరిగి తనకి అప్పగించవలసిందనీ ఆ దావాలో కోరాడు.
తన పక్షం తరఫున శ్రీమతి బెసెంటు తనే ఎంతో అనర్గళంగా వాదించింది. కాని సంరక్షణ విషయంలో దావా ఓడిపోయింది. అయితే లెడ్ బీటరు మీద చేసిన ఆరోపణలు మాత్రం నిలబడలేక పోయాయి. ఆమె ప్రివీ కౌన్సిల్ కు ఆభ్యర్థన పెట్టుకుంది. మరో కొత్త తీర్పు వచ్చేలోగా పిల్లలను యింగ్లండుకు పంపివేసింది. ఈ విధంగా కృష్ణమూర్తి జీవితంలో మొదటి అంకం ముగిసింది. అర్ధంలేని, నిలకడలేని చూపులతో 'స్వ' అనే భావం యింకా స్పష్టంగా రూపుదిద్దుకోకుండా వున్న ఒక పసివాడిని అతడి సాంప్రదాయకమైన పరిసరాల నుండి తొలగించి జగద్గురువుగా శిక్షణ గడిపే దశ- అదీ ముగిసిన ఆ అంకం.
ఇక్కడ దాకా వచ్చాక, కృష్ణమూర్తి ఎడల, జగద్గురువు అనే విశ్వాసం ఎడల శ్రీమతి బెసెంటు వైఖరికీ, లెడ్ బీటర్ వైఖరికీ మధ్యనున్న వ్యత్యాసం తెలుసుకోవడం వుపయోగంగా వుంటుంది. శ్రీమతి బెసెంటు లెడ్ బీటరును బాగా నమ్మింది; బహిరంగంగా వారి మధ్య ఏ విభేదాలు పొడములేదు; ఆయినా కూడా వారిద్దరూ కృష్ణమూర్తి భూమికను రెండు విభిన్న దృష్టులతో చూశారు. లెడ్ బీటరు స్వయంకృషితో పైకి వచ్చినవాడు అని చెప్పుకోవచ్చు; ముఖ్యంగా పందొమ్మిదో శతాబ్దంలో వున్న అర్ధంలో, సామాన్యమైన సామాజిక పరిస్థితుల్లో పుట్టినా మహాశక్తిమంతులుగా పరిణతి చెందిన జాన్ జేమ్స్ ఆడుబన్, సర్ హెన్రీ స్టాన్లీల లాగానే అతడు కూడా తన జీవితాన్ని గొప్ప భావనా బలంతోను, తగినంత అభినివేశం తోను చక్కగా నిర్మించుకున్నాడు. పందొమ్మిదో శతాబ్దపు ఆఖరి భాగంలో యూరపు ఖండంలో జీవితాలను కొత్తరకంగా వికసింపచేసుకోవడం అనేది ఒక ప్రత్యేక నైపుణ్యంతో