కృష్ణమూర్తి, వికాసోదయం
XXI
ఈ అతిశయోక్తుల వ్యవహారం కృష్ణమూర్తి మీద ఏ ప్రభావమూ చూపినట్లు కనపడటం లేదు. వుడ్ హౌస్ చెప్పినది యిట్లా వున్నది :
మొత్తం మీద కృష్ణమూర్తి మెత్తని విద్యార్థి; నొప్పించకుండా నడుచుకోవాలని అభిలషించేవాడు; అయితే అతనిలో అందరికీ దూరంగా వుండే స్వభావం వున్నది, చూపుల్లో అస్పష్టత-శూన్యత-పుండేవి. అది చూస్తే లెడ్ బీటరుకు ఒళ్ళు మండుతుండేది. ఒకసారి కృష్ణమూర్తి నోరు పెద్దగా తెరిచి పెట్టి శూన్యంలోకి చూస్తూ వుంటే, లెడ్ బీటరు నిగ్రహం కోల్పోయి గట్టిగా ఒక దెబ్బ వేశాడు. ఆ పిల్లవాడిని అదో పెద్ద మలుపు తిప్పింది. ఆ పైన లెడ్ బీటరుతో అతని బాంధవ్యంలో మార్పు వచ్చేసింది. ఇంకెప్పుడూ అట్లా నోరు తెరుచుకొని వుండకుండా చూసుకున్నాడు. అంతకంటే ముఖ్యం - దీర్ఘచింతనతో కూడుకున్న ఒక విశిష్టమైన చేతన అతనిలో చోటుచేసుకుంది. పెద్దవారయాక, పధ్నాలుగేళ్ళ వయసులో వున్న ఆ బాలుడిని గురించి కృష్ణమూర్తి, అతడిది ఖాళీ వ్యక్తిత్వం అనీ, ప్రపంచంవైపు విస్మయంతో చూసేవాడనీ అన్నారు: 'అదంతా అక్కడ వున్నది; సముద్ర తీరం, గవ్వలు, తెప్పకొయ్యలు; అతను, అదంతా.' నిజమైన పారమార్ధికునిలో వుండవలసిన సున్నితత్వం లేకపోవడం వలన లెడ్ బీటర్ ఆ బాలుడిలో వున్న ప్రత్యేకతను కని పెట్టలేక పోయాడని కృష్ణమూర్తి భావించారు. బహుశ ఆ బాలుడిలో వున్న విశేష తత్వానికున్న కీలకం అసలు యీ అస్పష్టతలోనే వున్నదేమో. అతని చేతనలో విస్తారమైన చోటు, ఒక ఖాళీతనం- దీనినే తరువాత మౌనమైన మనసు అని అన్నారు.