Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రచనలు

157

మధ్యాహ్నం దాటే వేళకు గాలి తగ్గిపోయింది. కాని సముద్రంమీది నుంచి పొగమంచు మళ్ళీ వచ్చి ఆవరించుకుంది.

ఈ భూమి మీద ఎంత అద్భుతమైన సౌందర్యం వుంది, ఎంత సంపన్నమైంది యీ భూమి! విసుగు అనేదే అనిపించదు. ఎండిపోయిన నదీ గర్భాలలో ఎన్నిరకాల ప్రాణులో జీవిస్తుంటాయి : ముళ్ళగడ్డి, రక్కిస మొక్కలు, ఎత్తుగా, పసుపురంగులో పూసే సూర్యకాంతులు. బండరాళ్ళమీద వూసరవెల్లులు, నలికెల పాములు వుంటాయి. తెలుపు, మట్టిరంగుల అడ్డచారలు వున్న పాము ఎండ పొడన పడుకున్నది. నల్లని నాలుకను బయటకు లోపలకు ఆడిస్తూ. డొంకకు అటువైపునుంచి కుక్క అరుపులు వినిపిస్తున్నాయి. ఉడతనో, కుందేలునో తరుముతూ వుండి వుంటుంది.

సంతుష్టి అంటే సఫలత పొందడంవల్లకానీ, ఒకదానిని సాధించడంవల్ల కానీ, వస్తు సంపద ఆర్జించడంవల్లకానీ కలిగేది కాదు. ఒక క్రియవల్లకానీ, నిష్క్రియవల్లకానీ అదీ కలగదు. 'ఉన్నది' తో మనం నిండిపోయినప్పుడు అది కలుగుతుంది తప్ప, 'వున్నది' ని సవరించడంవల్ల కాదు. నిండిపోయి వున్నప్పుడు సవరింపులు, మార్పులు అవసరం వుండవు, అసంపూర్ణమైనది సంపూర్ణంగా అవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది అసంతుష్టి, మార్పు అనే కల్లోలంలో చిక్కుకుంటుంది. 'ఉన్నది' అనేది అసంపూర్ణంగా వుంటుంది; అది సంపూర్ణం కాదు. సంపూర్ణంగా వుండేది వాస్తవంలో వుండదు. ఆ అవాస్తవాన్ని అందుకోవాలనే ఆరాటంలో అసంతుష్టి అనే బాధ వుంటుంది. ఈ బాధకు చికిత్స లేదు. ఈ బాధని తగ్గించాలనే ప్రయత్నం కూడా వాస్తవం కానీ దానికోసం అన్వేషించడమే. అందులోనుంచే అసంతుష్టి జనిస్తుంది. అనంతుష్టినుంచి తప్పించుకోవడానికి మార్గం లేదు. అసంతుష్టి గురించి ఎరుకగా వుండటమే వున్నది గురించిన ఎరుక. దానితో మనం నిండిపోయి వుండటంలో సంతుష్టి అని పిలవదగిన ఒక స్థితి వుంటుంది. దానికి వ్యతిరేకంగా వుండే స్థితి వుండదు.

ఆ యింటిలోనుంచి చూస్తే లోయ అంతా కనబడుతుంది. దూరంగా వున్న పర్వతాల్లోని అతి ఎత్తయిన శిఖరం అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు తాకి ఎర్రగా వెలుగుతున్నది. రాళ్ళమయంగా వున్న ఆ శిఖరం ఆకాశంలో నుంచి వేలాడుతున్నట్లు, దానీ గర్భంలో నుంచి వెలుగు వస్తున్నట్లు అనిపిస్తున్నది. చీకట్లు ముసురుకుంటున్న యీ గదిలోనుండి చూస్తుంటే ఆ సౌందర్యపు వెలుగు ఆన్నింటికీ అతీతంగా కనబడింది. అతను చాలా చిన్నవాడు. ఎంతో వుత్సాహాం, అన్వేషణాసక్తీ వున్నాయి అతనిలో.