156
కృష్ణమూర్తి తత్వం
వున్నత సింహాసనంమీద మిమ్మల్ని మీరే నిలబెట్టుకోకపోతే పడిపోవడం అనేది ఎందుకుంటుంది? స్వీయఘనత, వ్యక్తిగౌరవం, ఏదో ఒక ఆదర్శం అనే వున్నతపీరం మీద మిమ్మల్ని మీరే ఎందుకు నిలబెట్టుకున్నారు? ఇది కనుక మీరు అర్ధం చేసుకుంటే అప్పుడు గతాన్ని గురించి సిగ్గుపడటం వుండదు. అదంతా పూర్తిగా అదృశ్యమై పోతుంది. ఆ వున్నతపీరం లేకపోతే మీరు ఏమిటో అట్లాగే మీరు వుంటారు. ఉన్నతపీరం లేనప్పుడు, ఒకర్ని ఎక్కువగాను, ఒకర్ని తక్కువగాను చూపించిన ఆ ఎత్తుమీద మీరు నిలబడనప్పుడు, మీరు యిన్నాళ్ళూ చూడకుండా తప్పించుకొని తిరిగిన ఆ అసలు మీరు అక్కడ వుంటారు. 'వున్నది' ని, మీరు ఏమిటో దానిని, చూడకుండా తప్పించుకోవడంవల్లనే గందరగోళం, విరోధం, అవమానం, ద్వేషం కలుగుతాయి. మీరు ఏమిటో అది నాకు గాని, మరొకరికి గాని మీరు చెప్పవలసిన పనిలేదు. కానీ, మీరు ఏమిటి అనేది, అది ఏదయినా సరే, దాని ఎరుక మీకు వుండాలి. సమర్థించడం కాని, నిరోధించడం కానీ చేయకుండా దానితో జీవించండి. దానికొక పేరు పెట్టకుండా దానితో జీవించండి. ఎందుకంటే ఆ పేరే ఒక దూషణగానో, ఒక గుర్తింపుగానో పనిచేస్తుంది. ఏ భయమూ లేకుండా దానితో జీవించండి. భయం వుంటే దానితో సాన్నిహిత్యానికి అడ్డు వస్తుంది. సాన్నిహిత్యం లేనప్పుడు దానితో జీవించలేరు. సాన్నిహిత్యం వుండటమే ప్రేమించడం. ప్రేమ లేకుండా గతాన్ని మీరు తుడిచి వేయలేరు. ప్రేమ వున్నప్పుడు గతం వుండదు. ప్రేమించండి, అప్పుడు కాలం వుండదు.
(కమెంటరీస్ ఆన్ లివింగ్)
మనసులోని తుఫాను
ఈ రోజంతా పొగమంచు వదలకుండా వుండిపోయింది. సాయంత్రానికి కరిగి, మాయమయ్యేసరికి తూర్పునుంచీ గాలి వీచడం మొదలు పెట్టింది బొత్తిగా తేమ లేని ఆ గాలి తెరిపి లేకుండా వీస్తూ, రాలి పడిపోయిన ఆకుల్ని ఎగరగొట్టుతూ, నేలలో వున్న తడినంతా పీల్చేస్తున్నది. తీవ్రంగా వీస్తున్న తుఫాను గాలులతో భయంకరంగా వున్న రాత్రి అది. గాలి యింకా ఎక్కువైంది. ఇల్లు కిర్రు కిర్రుమని వూగుతున్నది. చెట్ల కొమ్మలు విరిగి కూలిపోతున్నాయి. ఆ మర్నాడు పొద్దున వాతావరణం ఎంత నిర్మలంగా వుందంటే, దూరాన వున్న పర్వతాలు చేత్తో తాకచ్చేమో అన్నంత స్పష్టంగా అనిపించాయి. గాలీ, దానితోపాటు వేడీ విజృంభించాయి.