Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

కృష్ణమూర్తి తత్వం

మెప్పుదల, పొగడ్తలు కావాలి. ఎప్పుడూ ఆశగా ఎదురుచూస్తూ వుంటాం. అవి దొరకనప్పుడు నిరాశలో మునిగిపోతాం. మన లోపల కసి, యీర్ష్య పెంచుకుంటాం. ఇక అప్పుడు వుద్రేకంగానో, నెమ్మదిగానో ఎవరో ఒకరి మీద తప్పు తోసేస్తాం. మనలోని యీ కటుత్వానికి బాధ్యత అంతా యితరులదే అని అంటాం. నీకు అందరికంటే గొప్ప ప్రాధాన్యం యిస్తాను, ఎందుకంటే నా సంతోషానికి, నా హోదాకి, నా పరువు ప్రతిష్ఠలకి నీమీద ఆధారపడతాను కాబట్టి. నీ ద్వారానే నా సార్థకత. అందుకని నాకు నీవు చాలా ముఖ్యం. నిన్ను రక్షించుకోవాలి, నిన్ను నా స్వాధీనంలో వుంచుకోవాలి. నా నుంచి నేను నీ ద్వారా తప్పించుకొని పారిపోతాను. వెనక్కి మళ్ళించి నన్ను నాకే ఎదురుగా నిలబెడితే, నా స్థితిని చూసి కలిగిన భయంలో కోపం తెచ్చుకుంటాను. కోపం రకరకాల రూపాలని తెలుస్తుంది; నైరాశ్యం, కసి, యీర్ష్య మొదలైనవి.

కోపాన్ని కూడబెట్టుకున్నప్పుడు అది ద్వేషమవుతుంది; దీనికి విరుగుడుగా క్షమాగుణం అవసరమవుతుంది. అయితే క్షమాగుణాని కంటే యీ కోపాన్ని కూడబెట్టుకోవడం అన్నదానిదే అనలు ప్రధానపాత్ర, కోపాన్ని కూడబెట్టి దోచుకోవడమే లేకపోతే క్షమాగుణం ఆవశ్యకతే వుండదు. ద్వేషం వున్నప్పుడే క్షమించడమూ అవసరమవుతుంది. నిర్లక్ష్యభావం అనే కారిన్యాన్ని పెంచుకోకుండా పొగడ్తలనుంచి, గాయపడినట్లుగా భావించడం నుంచి విముక్తి చెందాలంటే కరుణ, దయాగుణమూ తప్పక కావాలి. ఒక సంకల్పం చేసుకోవడం ద్వారా కోపాన్ని పోగొట్టుకోవడం సాధ్యంకాదు. ఎందుకంటే సంకల్పం హింసలో ఒక భాగం. కోరికకు పర్యవసానంగా సంకల్పం కలుగుతుంది. మరొకటి అవాలనే వ్యామోహం అది. కోరిక అంటేనే దాని స్వభావంలో దూకుడూ, మనదే పైచేయిగా వుండాలనే తత్వమూ వుంటాయి. గట్టిగా సంకల్పించుకొని కోపాన్ని అణచివేయడం దాన్ని మరొక స్థాయిలోకి తీసుకొనిపోతుంది. అప్పుడు దానీ పేరు యింకొకటవుతుంది. అయితే, అప్పుడు కూడా అది హింసలో భాగమే. అహింసను అలవాటు చేసుకోవడం ద్వారా హింసను వదుల్చుకోలేము. కోరికను అవగాహన చేసుకుంటేనే అది జరుగుతుంది. కోరికకు బదులుగా ఆధ్యాత్మికమైన ప్రత్యామ్నాయం ఏదీ వుండదు. కోరికను అణచివేయలేము, నిగ్రహించనూ లేము. కోరిక ఎడల మౌనంగా, యిష్టాయిష్ట ప్రసక్తి లేని ఎరుకతో వుండాలి. ఈ నిరాసక్తమైన ఎరుక కలిగివుండటమే కోరికను ప్రత్యక్ష అనుభవంలోకి తెచ్చుకోవడం.ఇక్కడ అనుభవించేవాడు ఆ కోరికకి ఒక పేరు పెట్టడం వుండదు.

(కమెంటరీస్ ఆన్ లివింగ్)