Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రచనలు

145

అందరి నుంచి దూరంగా విడదీసే ఒక ప్రత్యేక గుణం కోపంలో వుంటుంది. దుఃఖం లాగే యితర్లనుంచి మనల్ని దూరం చేస్తుంది. కనీసం ఆ కొంత సేపు అన్ని బాంధవ్యాలు అదృశ్యమై పోతాయి. ఏకాంతంగా వున్నవారిలో కనబడే దారుఢ్యమూ, జీవశక్తి కోపంలో కూడా తాత్కాలికంగా వుంటాయి. కోపంలో ఒక వింతైన నిస్పృహా వుంటుంది. అసలు ఒంటరిపోటు అంటేనే నిస్పృహ. నిరాశలో, అసూయలో, గాయపరచాలనే వాంఛలో వుండే కోపం గొప్ప తీవ్రత్వంతో బయటపడుతుంది. అందులో తనని తాను సమర్ధించుకోవడమనే సుఖం వుంటుంది. ఇతర్లని మనం నిరసిస్తాం. ఆ నిరసించడంలోనే మనల్ని సమర్థించుకోవడం వుంటుంది. ఏదో ఒక రకమైన యిటువంటి వైఖరి- తామే నీతిమంతులమనే స్వాతిశయంకానీ, లేదా ఆత్మన్యూనతాభావం కానీలేనప్పుడు మనం ఏమిటి? ధైర్యం తెచ్చుకోని బలం పుంజుకోవడానికి మనంతట మనమే రకరకాలుగా ప్రయత్నిస్తూ వుంటాం. ఇటువంటి పద్ధతుల్లో చాలా సులువైనది ద్వేషం. అటువంటిదే కోపమూ. మామూలు కోపం, క్షణాల మీద మరుపులో పడిపోయేదీ, ఛప్పున ఎగసి ఆరిపోయే మంట వంటిది అయిన కోపం- ఒక రకం. కావాలని ప్రయత్నపూర్వకంగా పెంచుకొని, మరగబెట్టి, గాయపరచాలనీ, ధ్వంసం చేయాలనీ చూసే కోపం పూర్తిగా మరొక రకానికి చెందినది. సరళమైన సాధారణ కోపానికి వెనుక ఏదో ఒక శరీరసంబంధమైన కారణం వుండచ్చు. అది కని పెట్టి చికిత్స చేసి నయంచేసుకోవచ్చు. కాని మనోతత్వ సంబంధమైన కారణం వల్ల జనించే కోపం అంతకంటే క్లిష్టంగా వుంటుంది. దానితో వ్యవహరించడమూ కష్టమే. మనలో చాలామందికి కోపం తెచ్చుకోవడానికి ఏ అభ్యంతరమూ వుండదు. ఏదో ఒక సాకు కోసం చూస్తూ వుంటాం, మనల్ని కాని, మన తోటివారిని కానీ యితరులు కష్ట పెడుతున్నప్పుడు ఎందుకు కోపం తెచ్చుకో గూడదు? అప్పుడు న్యాయం కోసం ఆగ్రహం తెచ్చుకుంటాం. కోపం వచ్చింది అని ఆ తర్వాత మాట్లాడకుండా వూరుకోవచ్చు కదా. అట్లా వూరుకోము. ఆ కోపానికి గల కారణాలను గురించి చాలా వివరంగా వ్యాఖ్యానాలు యిస్తాం. ఆసూయ, పగో నాకు వున్నది అని అనేసి వూరుకోం, దాన్ని సమర్థించడమో, దానిని గురించి వివరించడమో చేయాల్సిందే. అసూయ లేకుండా ప్రేమ వుంటుందా అని ప్రశ్నిస్తాం. ఎవరో చేసిన పనుల ఫలితంగా నాలో యీ కసి ఏర్పడింది అనీ యింకా యిట్లాంటివే ఎన్నో అంటూ వుంటాం.

మౌనంగా కాని, సంభాషణల ద్వారా కాని వివరించడం, మాటల్లో వ్యక్తీకరించడం కోపానికి విషయమూ, లోతూ యిచ్చి కోపం చల్లారి పోకుండా చూస్తాయి. మౌనంగానో, మాటల్లోనో మనం యిచ్చే వివరణాత్మక సమాధానాలు మనం ఏమిటి అన్నదానిని వున్నది వున్నట్లుగా కని పెట్టకుండా అడ్డుతగిలే అవరోధంగా పనిచేస్తాయి. మనకి