పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిబద్ధీకరణం

అతని ఆసక్తి అంతా మానవాళికి సేవలు చేయడంలో, మంచి పనులు చేయడంలో లగ్నమై వుంది. రకరకాల సమాజ సంక్షేమ సంస్థలతో, వాటి కార్యకలాపాలతో అతను తీరిక లేకుండా వుంటాడు. రోజులకొద్దీ సెలవు పెట్టి సరదాగా గడపడం అనేది ఎరగనే ఎరగనని అతడు అన్నాడు. కళాశాలలో చదువు ముగించగానే సమాజాభ్యుదయ కార్యక్రమాలను చేపట్టాడు. అప్పట్నుంచీ వదలకుండా అందులోనే నిమగ్నమై వున్నాడు. తను చేసే పనికి డబ్బు తీసుకోవడం అనే మాటే లేదుట. అన్నింటికంటే అతనికి తను చేస్తున్న పనే అతి ముఖ్యమైపోయింది. ఆ పనితో వీడదీయలేని బంధాన్ని పెంచుకున్నాడు. ఒక వుత్తమమైన సమాజ సేవకునిగా అతను స్థిరపడ్డాడు అది అతనికి నచ్చింది. అయితే ప్రసంగాలలో ఒకసారి. మనసుని నిబద్ధం చేసే రకరకాల పలాయన మార్గాలను గురించి చెప్తుంటే విన్నాడు. ఆ విషయమే యింకా వివరంగా మాట్లాడాలనుకుంటున్నాడు.

'సమాజ సేవకునిగా పనిచేయడం కూడా నిబద్దీకరణమే నంటారా? దీనివల్ల కూడా సంఘర్షణ పెరగడమే జరుగుతుందా?' నిబద్దీకరణం చెందడం అంటే ఏమిటో తెలుసుకుందాం. నిబద్ధీకృతమై వున్నా మనే ఎరుక మనకెప్పుడు కలుగుతుంది? అసలు ఆ ఎరుక మనకి వుంటుందా? మీరు నిబద్దీకృతులై వున్నారన్న సంగతి మీకు అసలు తెలుసా? మీ అస్తిత్వంలోని కొన్ని కొన్ని పొరల్లో మాత్రమే సంఘర్షణ, పోరాటం వున్నాయని అనుకుంటున్నారా? మనకి మన నిబద్దీకరణం గురించి తెలియకపోచ్చు కానీ మన సంఘర్షణలు, మన బాధలు, మన సుఖాల గురించి మాత్రం బాగా తెలుసు.

‘సంఘర్షణ అంటే మీ అర్థం ఏమిటీ?'

అన్ని రకాల సంఘర్షణలూ : దేశాల మధ్య, వివిధ సమాజాల మధ్య, వ్యక్తుల మధ్య వుండే సంఘర్షణలూ, మనిషి లోలోపల వుండే సంఘర్షణలూ కూడా, కర్తకి అంటే చర్య చేస్తున్న వాడికీ చర్యకీ మధ్య, ప్రేరణకి ప్రతిస్పందనకీ మధ్య సమైక్యత లేనంతవరకు సంఘర్షణ అనివార్యమే కాదా? సంఘర్షణే మన సమస్య, అవునా కాదా? ఏదో ఒక్క సంఘర్షణ కాదు. అన్ని రకాల సంఘర్షణలూ : భావాలకు, నమ్మకాలకు, సిద్ధాంతాలకు మధ్య గల పోరాటం, రెండు పరస్పర వ్యతిరేక విషయాల మధ్య పోరాటం; సంఘర్షణలు కనుక లేకపోతే సమస్యలే వుండవు.