Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

కృష్ణమూర్తి తత్వం

పెరిగిపోయింది. కొండలు కూడా బాగా నెమ్మది వహించినట్లు అనిపించింది. వాటి గుసగుసలు, వాటి కదలికలు ఆగిపోయాయి. బ్రహ్మాండమైన తమ బరువుని అవి కోల్పోయినట్లు కూడా అన్పించాయి.

ఆమె తనకు నలభై అయిదు ఏళ్ళు అని చెప్పారు. చాలా పొందికగా చీరకట్టుకొని వున్నారు, చేతులకు కాసిని గాజులున్నాయి. ఆమెతోపాటు వున్న పెద్దమనిషి ఆమె మేనమామట. అందరం నేలమీదే కూర్చున్నాం. అక్కడనుండి తోటంతా కనిపిస్తున్నది. ఒక మర్రిచెట్టు, కొన్ని మామిడిచెట్లు, పూలతో మెరిసిపోతున్న బోగన్ విల్లా, ఎదుగుతున్న కొబ్బరిచెట్లు కనబడుతున్నాయి. ఆమె విచారంగా వున్నారు. చేతులు అశాంతిగా కదులుతున్నాయి. తన లోపలినుంచి పొర్లుకొని వస్తున్న మాటలనీ, బహుశ కన్నీటిని కూడా బయటికి రాకుండా అణచివేసుకుంటున్నారు.

'మా మేనకోడలి గురించి మాట్లాడటానికి మీ వద్దకు వచ్చాం. కొద్ది సంవత్సరాల క్రితం యీమె భర్త పోయాడు. ఆ తరువాత కొడుకు పోయాడు. ఈమె దుఃఖాన్నుంచి తేరుకోలేక పోతున్నది. ఒక్కసారిగా వృద్ధాప్యం మీదపడ్డట్లుగా వున్నది. మాకు ఏం చేయాలో పాలు పోవడంలేదు. మామూలుగా వైద్యులు చెప్పే సలహాలేవీ పనిచేయడం లేదు. తన తక్కిన పిల్లల సంగతే పట్టించుకోవడం మానేసింది. రోజు రోజుకీ చిక్కి పోతున్నది. ఇదంతా చివరకు ఏవిధంగా పరిణమిస్తుందో తెలియడంలేదు. మిమ్మల్ని చూడాలనీ యీమె పట్టుబట్టడం వల్లనే యిక్కడికి వచ్చాము' అని ఆ మేనమామ చెప్పారు.

'నాలుగు సంవత్సరాల క్రితం నా భర్తను పోగొట్టుకున్నాను. ఆయన డాక్టరు; కేన్సరుతో పోయారు. చాలాకాలం తనకు కేన్సరున్న సంగతి నాకు చెప్పకుండా దాచి వుంచారు. ఇక చివరికి, అంటే ఆఖరి సంవత్సరంలో మాత్రమే నాకు ఆ సంగతి తెలిసింది. డాక్టర్లు మార్పిన్ మొదలైన మత్తుమందు లిచ్చేవారు. అయినా ఆయన విపరీతమైన బాధ అనుభవించారు. నా కళ్ళముందే కృశించి, కృశించి, చివరకు లేకుండా పోయారు'.

అక్కడ ఆపేశారు ఆవిడ, కళ్ళనీళ్ళు వుక్కిరిబిక్కిరి చేసేశాయి. కొమ్మమీద ఒక పావురం కూర్చొని చిన్నగా కువకువలాడుతున్నది. దీని రంగు కొంచెం మట్టిరంగు, కొంచెం బూడిదరంగు కలిసిన మిశ్రమంలాగా వుంది. చిన్న తల, పెద్ద శరీరం- మరీ అంత పెద్దది కాదు, పావురాయి కదా! అంతలోనే అది ఎగిరిపోయింది. పావురం ఎగిరిన వూపుకి కొమ్మ పైకీ కిందకూ వుయ్యాలలూగడం మొదలు పెట్టింది.