Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రచనలు

133

'ఈ ఒంటరితనాన్ని ఎందుకో నేను భరించలేక పోతున్నాను. ఆయన లేని జీవితం అర్థవిహీనంగా వుంది. నా పిల్లలంటే నాకు ప్రేమే. ముగ్గురు పిల్లలుండేవారు. ఒక అబ్బాయి, యిద్దరమ్మాయిలు. క్రిందటి సంవత్సరం ఒకరోజు మా అబ్బాయి స్కూలునుంచీ ఒక వుత్తరం రాశాడు, తనకు ఒంట్లో బాగుండటం లేదని, ఆ తరువాత కొద్దిరోజులకే హెడ్ మాస్టరు ఫోనుచేసి, మా అబ్బాయి చనిపోయాడని చెప్పారు.'

ఇక ఆమె ఆపుకోలేక వెక్కివెక్కి ఏడవడం మొదలు పెట్టారు. కొద్ది సేపటికి, ఒక వుత్తరం తీసి చూపించారు. అందులో ఆ అబ్బాయి తనకు ఒంట్లో బాగుండటంలేదనీ, యింటికి రావాలనుందనీ, అమ్మా నీవు కులాసాగా వున్నావని తలుస్తున్నాననీ రాశాడు తనగురించి పిల్లవాడికి ఎంత శ్రద్ధ వుండేదో ఆమె వివరించి చెప్పారు. అసలు అతనికి స్కూలుకి వెళ్ళడం యిష్టంలేదనీ, తల్లిని కనిపెట్టుకొని వుండాలనుకున్నాడనీ ఆమె చెప్పారు. దాదాపుగా అతన్ని బలవంతంచేసి స్కూలుకి పంపారట. ఎందుకంటే తనతో వుంటే తన దుఃఖం అతన్నీ బాధిస్తుందేమోనని. ఇప్పుడింక అంతా అయిపోయింది. ఆడపిల్లలిద్దరూ చాలా చిన్నవాళ్ళు. జరిగినదంతా పూర్తిగా గ్రహించే వయసు కాదు. ఆమెకి మళ్ళీ ఆవేశంలాగా వచ్చింది. “ఏం చేయాలో నాకు తోచడంలేదు. మృత్యువు నా జీవితపు పునాదులను మొదలంటా కుదిపివేసింది. ఒక యిల్లు కట్టుకున్నట్లుగా మా వివాహజీవితాన్ని గట్టి పునాదులు వేసి నిర్మించామని మేము అనుకున్నాం. ఈ విపరీత సంఘటనలవల్ల అంతా సర్వనాశనమై పోయింది.'

ఆ మేనమామకి దేవుడిలో విశ్వాసం వున్నట్లుంది. సంప్రదాయ వాదిలాగా వున్నాడు. అందుకని, “ఇదంతా ఆ పరమాత్ముడి లీల. ఈమె చేత అన్ని కర్మకాండలూ చేయించాను. కాని ఆమెకు నెమ్మది చేకూరలేదు. పునర్జన్మలో నాకు నమ్మకం వుంది. అయితే యీమెకు అదీ ఓదార్పునివ్వడం లేదు. అసలు ఆ మాట మాట్లాడటానికే యీమె యిష్టపడటంలేదు. అదంతా అర్థంలేనిదీగా ఆమెకు కనబడుతున్నది. మేమెవ్వరం ఆమెని ఓదార్చలేక పోతున్నాం' అని అందించారు.

కొంత సేపు అందరం మౌనంగా కూర్చుండిపోయాం. ఆమె జేబురుమాలు అప్పటికి పూర్తిగా తడిసిపోయింది. సొరుగులో నుంచి తీసి యిచ్చిన కొత్త జేబురుమాలు ఆమె బుగ్గల మీద కన్నీటిని శుభ్రంగా తుడిచివేసింది. కిటికీలోంచి ఎర్రని బోగన్ విల్లా తొంగిచూస్తున్నది. ప్రకాశవంతమైన దక్షిణపు కాంతి పడి ప్రతి ఆకూ వెలిగిపోతున్నది. | దీన్ని గురించి మీరు నిజంగానే లోతుగా మాట్లాడాలను కుంటున్నారా- లోపలగా వున్న మూలందాకా పోయి? లేదూ కొన్ని వివరణలతో, కొంత హేతు పూర్వకమైన