Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రచనలు

131

ఆ సుకుమారమైన ఆకుల్లోని మంచునీరు వాటి యీకలను తడుపుతున్నది. కాకులు అదేపనిగా కావు కావుమంటున్నాయి. ఒక కొమ్మ నుంచి మరో కొమ్మమీదికి ఎగురుతూ, ఆకుల మధ్య నుంచి తలలు పైకెత్తి చూస్తూ, రెక్కలు టపటప లాడిస్తూ, మధ్య మధ్య ముక్కులతో పొడుచుకొని రెక్కలను శుభ్రంచేసుకుంటున్నాయి. ధృఢంగా వున్న ఆ కొమ్మమీద సుమారు అరడజను కాకులు కూర్చున్నాయి. ఇంకా ఎన్నోరకాల పక్షులు ఆ చెట్టునిండా చెదరుమదరుగా వాలి, ప్రాతఃకాల స్నానాలు చేస్తున్నాయి.

ఈ నిశ్శబ్దం వ్యాపిస్తున్నది. ఆ కొండలను కూడా దాటి ఆవలగా పోతున్నది. రోజూలాగే పిల్లల అరుపులూ, నవ్వులూ మొదలయినాయి. తోట మెలమెల్లగా నిద్ర నుంచి మేలుకుంటున్నది.

ఈ రోజు చల్లగా వుండేటట్లుగా వుంది. ఇక యిప్పుడు కొండలు సూర్యుడి కాంతిని చేదుకుంటున్నాయి. అవి చాలా పురాతనమైన కొండలు- బహుశ ప్రపంచంలోకల్లా అతిప్రాచీనమైనవేమో- చాలా శ్రద్ధతో చెక్కినట్లు అనిపిస్తున్న వింత వింత ఆకారాల రాళ్ళు ఒకదానిమీద ఒకటి పేర్చి పెట్టినట్లుగా సుతారంగా నిలబడి వున్నాయి. అయితే గాలి వీచినా, చేతులతో కదిలించినా ఆ రాళ్ళు వాటిస్థానాలనుంచి పడిపోవు.

ఇది పట్నవాసాలకి చాలా దూరంగా వున్నలోయ. దీని మధ్య నుంచి మరో గ్రామానికి పోయే దారి వుంది. దారి ఎగుడుదిగుడుగా వుంటుంది. ఈ లోయలో ఏళ్ళ తరబడిగా నిలబడిపోయిన ప్రశాంతతను భగ్నంచేయడానికి కార్లు, బస్సులు ఏవీ యిటు రావు. ఎడ్లబళ్ళు పోతుంటాయి. అయితే వాటి కదలిక ఆ కొండల్లో ఒక భాగంగా కలిసి పోతుంది. ఈ ఎండిపోయిన నదీగర్భంలో కుండపోతగా వర్షాలు కురిస్తే తప్ప నీళ్ళు నిండవు. అక్కడి యిసుక ఎరుపు, పసుపు, మట్టిరంగుల మిశ్రమ వర్ణంలోగా వుంది. అది కూడా ఆ కొండలతో పాటు కదిలి పోతున్నట్లుగా వుంది. నిశ్శబ్దంగా నడిచిపోతున్న ఆ గ్రామీణులు కొండ రాళ్ళలాగా కనబడుతున్నారు.

రోజు గడిచిపోతున్నది. సాయంత్రమయ్యేసరికి, పడమటి కొండల్లో సూర్యుడు అస్తమిస్తుంటే, దూరంగా వున్న కొండలమీద నుంచి, చెట్లలో నుంచి నిశ్శబ్దం వ్యాపిస్తూ వచ్చి, చిన్న చిన్న పొదలనూ, పురాతనమైన మర్రిచెట్టునూ కప్పివేసింది. నక్షత్రాల ప్రకాశం ఎక్కువైన కొద్దీ, నిశ్శబ్దం అత్యంతమైన చిక్కదనాన్ని సంతరించుకున్నది. మనం భరించలేనంతగా.

గ్రామంలోని చిట్టిదీపాలు ఆరిపోయాయి. నిద్రతో పాటుగా యీ నిశ్శబ్దపు తీవ్రత్వం యింకా గాఢంగా, యింకా విశాలంగా, అన్నింటినీ తనలో యిముడ్చుకుంటూ