130
కృష్ణమూర్తి తత్వం
ఎరుక కలిగివుండటానికి చాలా వోరిమి, సున్నితత్వమూ అత్యావశ్యకం. ఉత్సాహం, ఆగిపోకుండా కొనసాగే సావధానత కూడా అవసరం. అప్పుడే ఆలోచనా ప్రక్రియ నంతటినీ పరిశీలించవచ్చును, అవగాహన చేసుకోవచ్చును.
(కమెంటరీస్ ఆన్ లివింగ్)
మరణం అనే యీ దుఃఖం ఎందుకు వున్నది?
ధ్యానం అంటే కొత్తది విచ్చుకొని వికసించడం. పునరావృత్తి వంటి గతానికి ఆవలగా, ఎత్తుగా కొత్తది వుంటుంది. ధ్యానం అంటే యీ పునరావృత్తిని సమాప్తం చేయడం. ధ్యానంవల్ల కలిగే మరణమే కొత్త యొక్క అమరత్వం, కొత్తది ఆలోచనల పరిధిలో వుండదు. ఆలోచనలు మౌనంగా వుండటమే ధ్యానం.
ధ్యానం ఒక సాధన కాదు, ఒక దివ్యస్వప్నాన్నీ అందుకోవడమూ కాదు, వుద్వేగ పూరితమైన యింద్రియానుభూతీ కాదు. అది నది వంటిది. దానిని లొంగదీసుకోలేము; అది వడివడిగా ప్రవహిస్తూ తీరాలను ముంచివేస్తూ వుంటుంది. ధ్వని లేని సంగీతం వంటిది అది. దానిని మచ్చిక చేసుకొని వుపయోగించుకోలేము. ఆరంభంలోనే పరిశీలకుడు లేకుండా పోయిన నిశ్శబ్దం అది.
ఇంకా సూర్యుడు పైకి రాలేదు. చెట్ల మధ్య నుండి వేగుచుక్క కనబడుతునే వున్నది. ఒకే అపూర్వమైన నిశ్శబ్దం అంతటా అలముకొని వున్నది. రెండు ధ్వనుల మధ్యనో, రెండు సంగీత స్వరాల మధ్యనో వుండే మౌనం కాదు. బొత్తిగా ఏ కారణమూ లేకుండానే వుండే నిశ్శబ్దం- యీ లోకం ఆరంభమైనప్పుడు యిటువంటి నిశ్శబ్దమే వుండివుంటుంది. లోయ, కొండలూ అన్నీ దానితో నిండిపోయాయి. రెండు పెద్ద పెద్ద గుడ్లగూబలు ఒకరినొకరు పిల్చుకుంటున్నాయి. అయితే ఆ నిశ్శబ్దాన్ని అవి భంగపరచలేదు. చాలా దూరంలో ఒక కుక్క ఆలస్యంగా వుదయించిన చంద్రుడిని చూసి మొరుగుతున్నది. అది కూడా యీ అపారనిశ్శబ్దంలో భాగంగానే అనిపిస్తున్నది. పొగమంచు బాగా దట్టంగా ముసురుకున్నది. కొండ చోటునుంచీ సూర్యుడు మెల్లిమెల్లిగా పైకి లేస్తుంటే చిత్రమైన వర్ణాలతోను, సూర్యుడి ప్రథమకిరణాల్లో వుండే ప్రకాశంతోను కొండ తళ తళ లాడటం మొదలు పెట్టింది.
జకరంద వృక్షాల సుకుమారమైన ఆకులు మంచుతో తడిసి బరువెక్కి పోయాయి. పక్షులు పుదయస్నానాలకై వచ్చి వాలాయి. అవి రెక్కలు అల్లల్లాడిస్తుంటే