Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

కృష్ణమూర్తి తత్వం

'అసాధ్యమైన విషయాలను గురించి మీరు చెప్తున్నారు! మన చదువులే మన మనసులకి విచక్షణ చేయడం, పోల్చిచూడటం, తప్పొప్పులు నిర్ణయించడం, ఎంచుకోవడం నేర్పి అందులో శిక్షణ యిస్తాయి. పరిశీలించినదానిని ఖండించకుండానో, సమర్థించకుండానో ఉండటం చాలా కష్టం. ఇటువంటి నిబద్దీకరణం నుంచి విముక్తి చెంది, మౌనంగా పరిశీలన చేయడం ఎట్లా?'

మౌనంగా పరిశీలించడం, నిర్లిప్తమైన ఎరుక వుండటం అవగాహనకు చాలా ఆవశ్యకం అని మీరు గ్రహించినప్పుడు, మీ గ్రహింపు అనే సత్యమే వెనకాలవున్న నేపధ్యమంతటి నుండి మిమ్మల్ని విడుదల చేస్తుంది. నిర్లిప్తంగా వుంటూనే, అప్రమత్తమైన ఎరుకను కూడా కలిగి వుండాలనే తక్షణావశ్యకతను మీరు గ్రహించనప్పుడు మాత్రమే 'ఎట్లా' అనే ప్రశ్నా, మన పూర్వ నేపధ్యాన్ని అంతరింపచేసుకొనే సాధనం కోసం అన్వేషణా బయల్దేరుతాయి. విడుదల కలిగించేది సత్యమే తప్ప సాధనం కానీ, పద్ధతి కానీ కాదు. మౌనపరిశీలన వల్ల మాత్రమే అవగాహన కలుగుతుందనే సత్యాన్ని మనం గ్రహించాలి. అప్పుడే యీ ఖండించడాలు, సమర్థించడాలు తొలగిపోతాయి. ఒక అపొయాన్ని చూసినప్పుడు దానినుంచి దూరంగా ఎట్లా పోవాలి అని ప్రశ్నిస్తూ మీరు కూర్చోరు. నిర్లిప్తమైన ఎరుకతో వుండవలసిన అవసరాన్ని మీరు చూడటంలేదు కాబట్టే 'ఎట్లా' అని అడుగుతున్నారు. అది చాలా అవసరం అనేది మీరు ఎందుకు గ్రహించడం లేదు?

'గ్రహించాలనే వుంది కాని యింతకు ముందు నేను యీ రకంగా ఆలోచించ లేదు. సమస్యలు నన్ను చిత్రవధ చేస్తున్నాయి కాబట్టి వాటిని వదుల్చుకోవాలని అనుకుంటున్నాను; అది మాత్రమే నేను గట్టిగా చెప్పగలను. అందరిలాగే నేను సంతోషంగా వుండాలని అనుకుంటున్నాను'.

నిర్దిష్టమైన ఎరుక అత్యావశ్యకం అన్న సంగతి గ్రహించడం మనకి యిష్టం వుండదు. ఇది మనకు తెలిసి జరగవచ్చు, తెలియకుండానూ జరగచ్చు. ఎందుకంటే సమస్యలను నిజంగా వదుల్చు కోవాలని మనకి వుండదు. సమస్యలు లేకపోతే మనం ఏమైపోతాం? అది ఎంత బాధాకరమైనదైనా సరే, మనకి తెలిసినదానిని పట్టుకొని వేలాడటమే నయం అనుకుంటాం. ఎందుకంటే ఎక్కడికి చేరవేస్తుందో తెలియని దానీ వెంటపడి అన్వేషించడంలో యింతకన్నా ప్రమాదం వున్నదని అనుకుంటాం. కాబట్టి సమస్యలు కనీసం మనకి బాగా అలవాటయిపోయాయి. అయితే, ఆ సమస్యలని సృష్టించిన కర్తని వెతికి పట్టుకోవాలనే ఆలోచన, చివరకు మనల్ని ఎక్కడకు చేరుస్తుందో తెలియక పోవడం వల్ల మనలో భయాన్ని, స్తబ్ధతనూ కలిగిస్తుంది. సమస్యలని