పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమస్యలూ, తప్పించుకొనే మార్గాలూ

'నాకు ఎన్నో ముఖ్యమైన సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించాలని నేను ప్రయత్నించినకొద్దీ యింకా క్లిష్టంగా, బాధాకరంగా తయారవుతున్నాయి. ఏం చేయాలో పాలుపోవడంలేదు, ఎటూ తోచకుండా వుంది. వీటికి తోడు నాకు చెవుడు కూడా వుంది. అందుకోసం పరమ వికారమైన యీ యంత్ర మొకటి పెట్టుకుంటున్నాను. నాకు చాలామంది పిల్లలున్నారు. నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. పిల్లల్ని గురించే చాలా దిగులుగా వుంది. నేను పడ్డ బాధలు, కష్టాలు మాత్రం వాళ్ళకి రాకూడదని కోరుకుంటున్నాను'.

మన సమస్యలకి ఒక పరిష్కారం వెతికి పట్టుకోపోలని ఎంత ఆత్రపడుతుంటాం! పరిష్కారం వెతికే ఆ తొందరలో అసలు సమస్యని గురించి సరిగ్గా విచారించలేము. సమస్యని మౌనంగా పరిశీలించడానికి అది అడ్డు తగులుతుంది. అసలు ప్రధానమైన విషయం సమస్య తప్ప పరిష్కారం కాదు. గట్టిగా చూస్తే పరిష్కారాన్ని కని పెట్టవచ్చు. అయితే సమస్య మాత్రం అట్లాగే కొనసాగుతుంది. ఎందుకంటే సమస్యకి పరిష్కారానికి ఏ సంబంధమూ లేదు. మనం వెతుకుతున్నది సమస్యనుంచి పారిపోయే మార్గం కోసం, పరిష్కారం అనేది వట్టి పైపై చికిత్స. దీనివల్ల సమస్యను అవగాహన చేసుకోవడం జరగదు. అన్ని సమస్యలకు మూలస్థానం ఒక్కటే. ఆ మూలస్థానాన్నీ అర్థంచేసుకోకుండా సమస్యల్ని పరిష్కరిద్దామని చూడటం వల్ల గందరగోళమూ, బాధా ఎక్కువవుతాయి. అసలు మొదట సమస్యని అవగాహన చేసుకోవాలనే వుద్దేశ్యం మనకి నిజంగా వుందా లేదా, అసలు యీ సమస్యలేవీ లేకుండా వుండాలనే ఆవశ్యకతను గ్రహించామా అనే సంగతి స్పష్టంచేసుకోవాలి. అప్పుడే సమస్యలను తయారు చేస్తున్న కర్తని సమీపించగలుగుతాము. సమస్యల నుంచి విముక్తి లేకుండా ప్రశాంతి లేదు. సంతోషంగా వుండాలంటే ప్రశాంతి అవసరం. అయితే అదే గమ్యం అని కాదు. పిల్లగాలులు వీచడం ఆగిపోయినప్పుడు నీటిమడుగు నిశ్చలంగా వున్నట్లు, సమస్యలు సమాప్తం అయినప్పుడు మనసు కూడా నిశ్చలమవుతుంది. అయితే మనసుని నిశ్చలంగా చేసివేయడం సాధ్యంకాదు. అట్లా చేస్తే అది మృతప్రాయమే, మురిగిపోయిన నీటిగుంట అవుతుంది. ఇది కనుక స్పష్టమవుతే, సమస్యలని తయారుచేసే కర్తని పరిశీలించవచ్చు. ఈ పరిశీలన మౌనంగా జరగాలి. బాధా సౌఖ్యాలని దృష్టిలో పెట్టుకొని ముందుగానే నిర్ణయించుకున్న ఒక పధకం ప్రకారంగా జరగకూడదు.