Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సందేహాలు, సమాధానాలు

101

కోరుతూ మీలోలోపల వున్న అచేతన కాంక్షలు జారీ చేస్తున్న ఆజ్ఞలను అన్నింటినీ పక్కకి నెట్టేసి, అద్భుతమైన ఆ స్థితిలో వుండే ఆ అనుభూతినీ యిప్పుడే రుచి చూడగలరా, అనుభవించగలరా? ఇప్పుడే ఆ స్థితిని కనుక మీరు అనుభూతి పొందగలిగితే అప్పుడిక జీవించడం, చనిపోవడం రెండూ ఒకటే అవుతాయి.

కాబట్టి, 'నేను' అనేది- విస్తారమైన చదువు, విజ్ఞానం, అసంఖ్యాకమైన అనుభవాలు, పోరాటాలు, ప్రేమలు, ద్వేషాలు కలిగివున్న యీ 'నేను' - సమాప్తం చెందగలదా? సమస్తమైన ఆ జ్ఞాపకాలు 'నేను' లో ముద్రితమై వున్నాయి. అటువంటి యీ 'నేను' సమాప్తమై పోగలదా? ఒక ప్రమాదంలో గాని, ఒక వ్యాధివల్లగానీ అంతమై పోవడం కాకుండా, యిక్కడ కూర్చొనివుండగానే మీరు, నేను ఆ ముగింపు ఏమిటో తెలుసుకోగలమా? అప్పుడు మరణం గురించీ, శాశ్వతత్వం గురించీ, దీనికి తరువాత మరో లోకం వున్నదా అనీ అవివేకమైన ప్రశ్నలు ఏవీ మీరు అడగరు. అప్పుడు అసలు సమాధానం మీకే తెలిసిపోతుంది. ఎందుకంటే అజ్ఞేయమైనది అప్పుడు వునికిలోకి వచ్చేస్తుంది. అప్పుడు పునర్జన్మ అనే వ్యర్థప్రలాపాలు, బ్రతుకు అంటే భయం, చావు అంటే భయం, వయసు పై బడుతున్నదనీ, యితర్లచేత చేయించు కోవాలేమో అని భయం, ఒంటరితనం గురించీ, మరొకరికి భారంగా వుండటం గురించీ యీ విధమైన రకరకాల భయాలు- యివన్నీ సమాప్తమై పోతాయి. ఈ మాటలు కేవలం అర్థంలేని కబుర్లు కావు. మనసు తను శాశ్వతంగా కొనసాగాలని ఆలోచించడం ఆపివేసినప్పుడు, అజ్ఞేయమైనది వునికిలోకి వస్తుంది.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, IX వాల్యూమ్,

ఒహాయి, 21 ఆగష్టు, 1955.


ప్రశ్న : నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటాను. నా ప్రార్థనలు విని, ఆయన నా కోరికలు తీరుస్తుంటారు. దేవుడున్నాడు అని యిది రుజువు చేయడం లేదా?

కృష్ణమూర్తి : ఒక నిదర్శనం ఆధారంగా దేవుడున్నాడని మీరు నిరూపిస్తుంటే అది దేవుడు కానే కాదు (నవ్వులు). ఎందుకంటే నిదర్శనం లేదా రుజువనేది మనసుకి సంబంధించినది. దేవుడున్నాడు. లేడు అనే సంగతి నిరూపించడం మనసుకి ఎట్లా సాధ్యమవుతుంది? మనసు తన తృప్తికోసం, తన అభిరుచి ప్రకారం, తన సుఖసంతోషాల కోసం లేదా తన భయంవల్ల దేవుడు అని మీరు అంటున్న దీన్ని తయారు చేసుకుంది. అటువంటి చిత్రకల్పన దేవుడు అవడు. అది కేవలం ఆలోచన చేసిన సృష్టి; మనకు తెలిసిన దానితో అంటే గతం సహాయంతో అల్లుకున్న చిత్రకల్పన.