100
కృష్ణమూర్తి తత్వం
వెళ్ళిపోవచ్చు. మరణం కలిగినప్పుడు అది ఒక అద్భుతమైన ఘడియ అవాలి, ప్రాణంతో వుండటమంత మహాశక్తివంతమైనదీ అవాలి.
సరే, ప్రాణం వుండగానే నేను మరణగృహంలో ప్రవేశించగలనా, మీరు ప్రవేశించగలరా? అదీ సమస్య- పునర్జన్మ వున్నదా లేదా అని కాదు. మనం మళ్ళీ జన్మించే మరో లోకం వున్నదా అనీ కాదు. అవన్నీ బొత్తిగా పరిణతిలేని పసివయసు ఆలోచనలు. బ్రతికి వున్న మనిషి ఎప్పుడూ 'ప్రాణం అంటే ఏమిటి' అని అడగడు. బ్రతికి వుండటం గురించీ అతను సిద్ధాంతాలు చేయడు. సగం చచ్చి, సగం ప్రాణంతో వున్న మనిషి మాత్రమే జీవితానికి గల ప్రయోజనం గురించి మాట్లాడుతూవుంటాడు.
కనుక, మీరూ నేను కూడా, జీవించి వుండగానే, చైతన్యంతోను, చురుకుగాను వున్నప్పుడే, మనకు ఏ ఏ శక్తి సామర్థ్యాలు వున్నాయో అవన్నీ, యింకా వున్నప్పుడే మరణం అంటే ఏమిటో తెలుసుకోగలమా? అప్పుడు మరణం వేరూ, జీవించడం వేరుగా వుంటాయా? మనలో చాలామందికి సజీవంగా వుండటం అంటే శాశ్వతమైనవీ అని మనం అనుకునేవి అట్లాగే కొనసాగుతూ వుండటం. అంటే మన పేరు, మన కుటుంబం, మన ఆస్తిపాస్తులు, ఆర్థికంగాను, ఆథ్యాత్మికంగాను మనకు లాభసాటిగా వుండేవి, మనం అలవరచుకున్న సద్గుణాలు, మనోద్వేగాల ద్వారా మనం ఆర్జించుకున్న విషయాలు- యివన్నీ ఎప్పటికీ వుండిపోవాలని కోరుకుంటాం. మరణం అనే పేరుతో మనం పిలిచే ఆ క్షణం మనకు బొత్తిగా తెలియని క్షణం. అందుకని భయపడతాం. అందుకు వూరటగా, వుపశమనంగా వుండే దాని కోసం ప్రయత్నిస్తాం. మరణించాక మళ్ళీ యింకో జీవితం వుంటుందా వుండదా అనీ, యింకా సవాలక్ష సంగతుల గురించీ తెలుసుకోవాలనుకుంటాం. అవన్నీ వ్యర్థమైన సందేహాలు. అవన్నీ సోమరి పోతులూ, జీవించి వుండగానే మరణం గురించి తెలుసుకోవడం యిష్టపడని వారూ వేసే ప్రశ్నలు. కాబట్టి మరణం గురించి మీరూ, నేనూ కలిసి కని పెడదామా?
చనిపోవడం అంటే ఏమిటి? మీకు తెలిసినవన్నీ పూర్తిగా ముగిసిపోవడం. మీరు తెలుసుకున్నదంతా ముగిసి పోకపోతే అది మరణం కాదు. మరణం అంటే ఏమిటో ముందే తెలుస్తే అప్పుడు మీరు భయపడవలసిన పనే లేదు. అయితే మరణం మీకు తెలుసా? అంటే, అనిత్యమైన ఒకదానిలో ఎల్లకాలం కొనసాగుతూవుండే దానిని కని పెట్టాలనే నిరంతర పోరాటాన్ని మీరు సజీవంగా వున్నప్పుడే ఆపివేయ గలరా? అజ్ఞేయమైన దానిని (తెలుసుకోలేనిదానిని), మరణం అని మనం అనే ఆ స్థితిని జీవించి వుండగానే మీరు తెలుసుకోగలుగుతారా? మరణించాక ఏమవుతుందో అన్నదానిని గురించి పుస్తకాల్లో మీరు చదివిన రకరకాల వర్ణనలను, వుపశమనం