102
కృష్ణమూర్తి తత్వం
మనసు వెతుకుతూ వుంటుంది, దేవుడి కోసం చురుకుగా అన్వేషిస్తూ వుంటుంది. అయితే మనసు తెలుసుకున్నది దేవుడు కాదు. ఈ ప్రశ్న అడిగినవారు తము చేసిన ప్రార్థనలకు దేవుడు బదులు పలికాడంటున్నారు. దేవుడున్నాడనడానికి యీ రుజువు చాలదా అని అడుగుతున్నారు. ప్రేమను రుజువు చేసి చూపాలని మీరు అనుకుంటారా? ఒకరిని మీరు ప్రేమించినప్పుడు ఆ సంగతి నిరూపించాలనుకుంటారా? ప్రేమకి ఒక రుజువు వుండితీరాలని మీరు అనుకుంటే అదీ అసలు ప్రేమేనా? మీ భార్యాపిల్లల్ని మీరు ప్రేమిస్తూ, ఒక రుజువు చూపాలని అనుకుంటుంటే, అప్పుడది యిచ్చిపుచ్చుకునే బేరం అవుతుంది. కాబట్టి దేవుడిని మీరు ప్రార్థించడం కూడా ఒక బేరం పెట్టడం వంటిదే. (నవ్వులు). నవ్వులతో తీసిపారేయకండి. ఇది చాలా గంభీరమైన విషయం. ఒక యదార్ధం. ఈ ప్రశ్న అడిగినవారు దేవుడు అని తము పిలుస్తున్నవారిని అర్థిస్తున్నారు, వేడు కుంటున్నారు. త్యాగాల ద్వారా, కర్తవ్య నిర్వహణ ద్వారా, బాధ్యతా నిర్వహణ ద్వారా సత్యాన్ని కనుక్కోలేరు. ఎందుకంటే యివన్నీ ఒక లక్ష్యం చేరుకోవడం కోసం వుపయోగించే సాధనాలు. అటువంటప్పుడు ఆ లక్ష్యానికీ, సాధనాలకూ పెద్ద వ్యత్యాసం ఏమీ వుండదు. సాధనమే లక్ష్యం అవుతుంది.
'నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఆయన బదులు పలుకుతాడు' అని యీ ప్రశ్న వేసినవారు అంటున్నారు. దీనిని కూడా పరిశీలిద్దాం ప్రార్థన ఆంటే మీ అర్థం ఏమిటి? మీరు చాలా వుల్లాసంగా వున్నప్పుడు, సంతోషంగా వున్నప్పుడు, ఏ గొడవలూ, ఏ బాధలూ లేకుండా వున్నప్పుడు ప్రార్థిస్తారా? దుర్భరమైన బాధలున్నప్పుడే, అలజడీ, భయమూ, సంక్షోభమూ వున్నప్పుడే ప్రార్ధిస్తుంటారు. మీ ప్రార్థన అర్ధింపులతో, వేడుకోళ్ళతో కూడుకొని వుంటుంది. బాధలో వున్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుందని మీరు కోరుకుంటారు, ఒక వున్నతమైన శక్తి ఏదో మీకు చేయూత నివ్వాలని కోరుకుంటారు. సహాయం కోసం వేడుకొనే రకరకాల ప్రక్రియలనే ప్రార్ధన అని అంటున్నారు. అంటే ఏం జరుగుతున్నదన్నమాట? ఎవరిముందో మీ భిక్షాపాత్రను జాపుతున్నారు. అది ఎవరిముందయితే ఏమిటి- ఒక దేవదూత అవచ్చు, మీరే స్వయంగా చిత్రకల్పన చేసుకొని దేవుడు అని పేరు పెట్టుకున్న వారవచ్చు. భిక్ష ఎత్తిన మరుక్షణమే ఏదో ఒకటి మీకు దొరుకుతుంది. అయితే ఆ లభించినది అసలైనదా కాదా అనేది వేరే విషయం. మీకు కావలసినది మీ కలతలు, మీ బాధలు తీరిపోవడం. అందుకని సంప్రదాయంగా వస్తున్న కొన్ని ప్రత్యేకమైన మాటల్ని పేర్చి మీ భక్తిని బయటకు ప్రదర్శిస్తారు. ఆపకుండా పదేపదే అవి పునశ్చరణ చేయడంవల్ల మనస్సు నెమ్మదించే మాట నిజమే. అయితే అది అసలైన ప్రశాంతి కాదు. కేవలం మనసుని