Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

కృష్ణమూర్తి తత్వం


సరే, భయం అంటే ఏమిటి? భయం ఒక మాటా? ఒక భావమా?అది ఒక ఆలోచనా? యదార్థమా? భయం అనే మాట ద్వారా భయం వునికిలోకి వస్తున్నదా లేక ఆ మాటకూ భయానికీ సంబంధం లేదా? సర్! దయచేసి నాతో పాటు కలిసి ఆలోచించండి. అలసిపోకండి. మనస్సును అటు యిటూ పోనీయకండి. మీకు నిజంగానే యి భయం అనే సమస్య గురించి అక్కర వుంటే- మీ ఒక్కరికే కాదు, ప్రతి మనిషికీ యిది తప్పకుండా వుంటుంది. చావు అంటే భయం, మీ తాతగారో, అమ్మమ్మో చనిపోతారనే భయం- యింత ఘోరమైన కారునలుపు బరువును మీరు మోస్తున్నారు కాబట్టి, యీ సమస్యను పక్కకి తోసేయకుండా దానితో సూటిగా మీరు తలవడవద్దూ? ఈ సమస్యను జాగ్రత్తగా పరిశీలిస్తే, భయానికి దూరంగా పారిపోవడంతోనూ, ధైర్యం అలవరుచుకోవడం మొదలైన పద్ధతులతోనూ దానికి అడ్డంగా గోడలు కట్టడం ద్వారా భయాన్ని వ్యతిరేకించే నిరోధ భావాన్ని పెంచు కుంటున్నంత కాలం సంఘర్షణ తప్పదని తెలుస్తుంది. నిరోధ భావమే యీ సంఘర్షణను, రెండు వ్యతిరేకతల మధ్య సంఘర్షణను సృష్టిస్తుంది. రెండు వ్యతిరేకతల మధ్య గల సంఘర్షణ ద్వారా అవగాహన చేసుకోవడం ఏనాటికీ సాధ్యం కాదు.

పూర్వ పక్షానికీ, ప్రతి పక్షానికీ మధ్యన జరిగే సంఘర్షణ ఫలితంగా సమన్వయం సిద్ధిస్తుందనే వాదంలో నిజం లేదు. 'ఉన్నది' అనే వాస్తవాన్ని అర్థం చేసుకోవడం వల్ల అవగాహన కలుగుతుంది తప్ప దానికి వ్యతిరేకమైన దానిని సృష్టించడం వల్ల కాదు. కనుక, నిరోధభావం లేకుండా, అక్కడ నుండి పారిపోకుండా, భయాన్ని ముఖాముఖిగా ఎదుర్కోగలనా, దాని వైపు చూడగలనా? భయంవైపు చూస్తున్న యీ సత్వం ఏమిటి? నేను భయపడుతున్నాను అన్నప్పుడు, యిందులోని 'నేను' ఏమిటి, 'భయం' ఏమిటి? అవి రెండు వేరు వేరు దశలా, రెండు వేరు వేరు ప్రక్రియలా? 'నేను' భావిస్తున్న భయం వేరూ, నేను వేరూనా? నేను వేరూ, భయం వేరూ అయితే, అప్పుడు ఆ భయాన్ని నేను ఏదయినా చేయగలను, దానిని మార్చగలుగుతాను, నిరోధించగలుగుతాను, పక్కకి తోసేయగలుగుతాను. అయితే, భయమూ నేను కనుక వేరు వేరు కాకపోతే అప్పుడు చర్య పూర్తిగా భిన్నంగా వుంటుంది కదూ?

సర్! యిదంతో బొత్తిగా వూహకి అందనంత అస్పష్టంగానూ, క్లిష్టంగానూ వున్నదా? బాగా వివరంగా తెలుసుకుందాం రండి, దయచేసి శ్రద్దగా వినండి. వాదించకుండా వూరికే వినండి. ఎందుకంటే వినడం వల్ల మాత్రమే, వాదప్రతివాదాల్లో పడిపోకుండా వట్టిగా వినడం వల్ల మాత్రమే నేను చెప్తున్నది మీరు ఆకళింపు చేసుకోగలుగుతారు.