పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సందేహాలు, సమాధానాలు

91

నాలో రెండు ప్రక్రియలు పనిచేస్తున్నాయి ఒకటి అన్నీ సాధించాలనీ, పరువు ప్రతిష్ఠలు సంపాదించాలనీ, విజయం చేపట్టాలనీ కోరుకుంటున్న సత్వం; మరొకటి యివన్నీ నేను సాధించలేనేమోనని ఎప్పుడూ భయపడుతూ వుండే రెండో సత్వం.

నాలోనే రెండు ప్రక్రియలు పనిచేస్తూ వున్నాయన మాట. రెండు కోరికలు, రెండు వ్యాపకాలు- 'నేను సంతోషంగా వుండాలనుకుంటున్నాను' అని అనేది ఒకటి, యీ ప్రపంచంలో సంతోషం లేనే లేదేమో అని తెలుసుకున్న మరొకటి. నేను ధనవంతుడిని కావాలి. లక్షలాది పేదవారు నాకు కనబడుతూనే వున్నారు. అయినా సరే, ధనవంతుడినవాలని నేను ఆకాంక్షిస్తాను. భద్రతకోసం కాంక్ష నన్ను నడిపిస్తున్నంత వరకు, ఆ కాంక్ష నన్ను తరుముతున్నంత వరకు నాకు విముక్తి లేదు. మళ్ళీ నా లోపలే కరుణ, ప్రేమ, సున్నిత తత్వమూ కూడా వున్నాయి. నా లోపల ఒక అంతులేని సమరం జరుగుతునే వుంటుంది. ఆ సమరమే బయటపడి, సంఘవిద్రోహకరంగా తయారవుతుంది, యింకా ఎన్నో జరుగుతాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ లోపలి సమరాన్నుండి, అంతర్గతమైన యీ సంఘర్షణ నుండి నేను ఎట్లా విముక్తుడి నవుతాను నా లోపల ఒక్క ప్రక్రియను మాత్రమే నేను పరిశీలించుకుంటూ, ద్వంద్వ ప్రక్రియను అలవర్చుకోకుండా వుంటే సంఘర్షణను ఎదుర్కోవడానికి అవకాశం వుంది. అంటే సద్గుణాలని, ధైర్యాన్ని అలవరచుకోకుండా భయాన్ని దాని స్వస్వరూపంలోనే పరిశీలిస్తూ వుంటే భయంతో తలపడవచ్చు. దీని అర్థం ఏమిటంటే 'వుండవలసిన దానిని' కాకుండా 'వున్నదానిని' తెలుసుకుంటే, అప్పుడు 'వున్నదానిని' ఎదుర్కొన గలుగుతాం. అయితే మనలో చాలామందికి 'వున్నది' ఏది అని తెలియదు. ఎందుకంటే చాలామంది 'వుండవలసినది' ఏది అన్నదానిలోనే ఆసక్తి చూపుతారు కాబట్టి. ఈ 'వుండవలసినది' ద్వైదీభావాన్ని సృష్టిస్తుంది. 'ఉన్నది' ఎప్పుడూ ద్వైదీభావాన్ని సృష్టించదు. 'ఉండవలసినది' సంఘర్షణను, ద్వైదీభావాన్ని తీసుకువస్తుంది.

కాబట్టి 'వున్నది' ని, ఘర్షణను కలిగించే దీని వ్యతిరేకమైన దానిని తీసుకు రాకుండా చూడగలనా; 'వున్నది' ని ఏ నిరోధభావమూ లేకుండా చూడగలనా? ఎందుకంటే నిరోధించడమే వ్యతిరేకమైన దానిని తయారు చేస్తుంది. అవును కదూ? అంటే, నేను భయపడుతున్నప్పుడు ఏ నిరోధభావమూ నాలో కలిగించుకోకుండా ఆ భయంవైపు చూడగలనా? ఎందుకంటే భయాన్ని వ్యతిరేకిస్తూ నిరోధభావం కలిగిన ఆ క్షణంలోనే మళ్ళీ మరొక సంఘర్షణను నేను సృష్టిస్తాను. 'ఉన్నది' నీ ఏ నిరోధ భావమూ లేకుండా నేను చూడగలనా? అట్లా చేయగలిగితే, భయంతో నేరుగా తలపడటం నాకు చేతనవుతుంది.