90
కృష్ణమూర్తి తత్వం
ధైర్యం భయానికి వ్యతిరేకమైన గుణం. మనసు ధైర్యమూ, భయమూ అనే రెండింటిలో చిక్కుకొని పోయినప్పుడు, మళ్ళీ వీటికి నిరోధాన్ని అలవరచుకోవడమే తప్ప పరిష్కారం జరగదు. కాబట్టి ధైర్యం అలవరచుకోవడం ద్వారా భయాన్ని పోగొట్టుకోలేము.
అయితే నేను భయాన్ని పోగొట్టుకోవడం ఎట్లా? దయచేసి శ్రద్దగా వినండి. ఇది మన సమస్య. మీదీ, నాదీ, భయాన్నుంచి విముక్తి కోరే ప్రతి మానవుడిదీ కూడా. ఎందుకంటే భయం నుంచి నేను విముక్తి పొందానంటే అప్పుడు యీ 'నా', ప్రపంచంలో యింత దుర్మార్గాన్నీ, యింతటి క్షోభను సృష్టిస్తున్న యీ 'స్వార్థం' అనేది అదృశ్యమై పోతుంది. భయానికి కారణం యీ 'నేను' అన్నదాని స్వభావమే కాదూ? నాకు భద్రత కావాలి, ఆర్ధికమైనదో, కాకపోతే రాజకీయమైనదో నాకు భద్రత కావాలి. లేదా నాకు సమాజంలో కీర్తి కావాలి. పైలోకంలో నాకు భద్రత కావాలి. దేవుడి వద్ద నుంచి నాకు హామీ కావాలి, ఆయన నన్ను భుజం తట్టి మెచ్చుకోవాలి. 'వచ్చే జన్మలో నీ అదృష్టం బాగుంటుంది' అనాలి. ఇట్లా నాతో అనడానికి, నన్ను ప్రోత్సహించడానికి, ఆశ్రయమూ, రక్షణా యివ్వడానికి ఒకరు నాకు కావాలి. ఎటువంటి రూపంలోనైనా సరే భద్రత కోరుకుంటున్నప్పుడు దాని వెనకాల భయం తప్పకుండా వుండి వుంటుంది. ఈ భయంలో నుండే పుట్టుకొస్తాయి ప్రాధమికమైన కాంక్షలన్నీ కూడా. కాబట్టి భయం అంటే ఏమిటి అనేది కనుక నేను అవగాహన చేసుకుంటే అప్పుడు బహుశ ఎడతెగనీ యీ కోరికల్లో నుండి బయట పడటం జరుగుతుంది.
భయం అంటే ఏమిటో నేను ఎట్లా అవగాహన చేసుకోగలను? క్రమ శిక్షణ అమలు పరచకుండా, నిరోధం చూపకుండా, దాని నుంచి పారి పోకుండా, రకరకాలైన భ్రాంతులలోనో, సమస్యలలోనో, గురువులలోనో, వేదాంతులలోనో పడిపోకుండా అసలు భయాన్ని ఎట్లా ఎదుర్కోగలుగుతాను, ఎట్లా అర్థం చేసుకోగలుగుతాను, ఎట్లా దాని నుండి విముక్తి చెంది ఆవలగా పోగలుగుతాను? భయానికి దూరంగా పారిపోకుండా వున్నప్పుడే, నిరోధం చూపకుండా వున్నప్పుడే దానిని అర్ధం చేసుకోగలుగుతాను. ఇప్పుడు, యీ నిరోధించే సత్వం ఎవరు, ఏమిటి అన్నది మనం తెలుసుకుందాం, భయాన్ని నిరోధిస్తున్న యీ 'నేను' ఎవరు? సర్! మీకు అర్ధమవుతున్నదా? అంటేనేను భయపడుతున్నాను; నేను మర్యాదస్తుడిగా పేరు పొందాలనుకుంటున్నాను, కాబట్టి ప్రజలు నా గురించి ఏమంటారో అని భయపడుతున్నాను. నేను లోకంలో ఎన్నో సాధించాలనుకుంటున్నాను. పేరు, ప్రతిష్ట, అధికారము సంపాదించాలని కోరుకుంటున్నాను. అందుకని నాలో ఒక భాగం వీటి వెనకాల పరుగులు పెడుతున్నది. లోలోపల, నేను ఏది చేసినా ఆశాభంగానికే దారి తీస్తుందనీ, నేను చేయాలను కుంటున్నవే నాకు ఆటంకంగా నిలుస్తాయని మరొక భాగం అనుకుంటుంది. కాబట్టి