Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సందేహాలు, సమాధానాలు

93

భయాన్ని నిరోధిస్తున్నంత వరకు, భయపు బారినుండి నాకు విముక్తి వుండదు. పైగా సంఘర్షణ ఎక్కువవుతుంది, బాధ ఎక్కువవుతుంది. నిరోధభావం చూపనప్పుడు భయం మాత్రమే వుంటుంది. ఇక, భయం పరిశీలకుడి నుండి, 'నేను భయపడు తున్నాను' అనే 'నా' నుండి విడిగా వుంటుందా? 'నేను భయపడుతున్నాను' అంటున్న యీ 'నేను' ఏమిటి? నేను భయం అని పిలుస్తున్న ఆ మనోభావంతోనే యి 'నా' అనేది కూడా తయారు చేయబడింది కదూ? 'నా' అంటే భయం అనే భావమే కదా? భయం అనే మనోభావం లేకపోతే 'నా' కూడా' పుండదు. కాబట్టి యీ 'నా', యీ భయమూ ఒక్కటే. భయం కాకుండా 'నా' అనేది ఒకటి విడిగా లేదు. కాబట్టి భయమే 'నేను'. కనుక వున్నది భయం ఒక్కటే.

ఇప్పుడిక, యిది విచారణ చేద్దాం. భయం అనేది కేవలం ఒక మాటా? భయం అనే ఒక మాటను, ఆ భావాన్ని, ఆ సంకేతాన్ని, ఆ దశను- అసలు వాస్తవంతో ఏ సంబంధమూ లేకుండా మనసు సృష్టించిందా? దయచేసి వినండి. భయమే 'నా', ఇది కాకుండా మరో 'నేను' అనేదీ విడిగా లేదు. మానవుడు, యీ 'నేను'- 'నేను చాలా దురాశ కలవాడిని' అని అంటాడు. 'నేను' దే ఆధిపత్యం అంతా. ఆ గుణం 'నేను' నుండి విడిగా లేదు. 'నేను దురాశనుండి విముక్తి పొందాలి' అని 'నేను' అనుకుంటున్నంతవరకు, అది ప్రయత్నం చేస్తూనే వుంటుంది, పోరాటం సలుపుతూనే వుంటుంది, కానీ ఆ 'నేను' లో దురాశ మాత్రం యింకా అట్లాగే వుంటుంది. ఎందుకంటే దురాశ లేకుండా వుండాలని ఆది కోరుకుంటూ వుంటుంది కనుక. అదే విధంగా 'నేను భయాన్ని పోగొట్టు కోవాలి' అని 'నేను' అనుకున్నప్పుడు అది నిరోధ భావాన్ని అలవరుచుకుంటున్నది. అందువల్ల సంఘర్షణ కలుగుతుంది. భయం మాత్రం ఎప్పటికీ తొలగిపోదు. అందువల్ల భయమే 'నేను' అనే వాస్తవాన్ని గుర్తించినప్పుడు, ఆ వాస్తవాన్ని అవగాహన చేసుకున్నప్పుడు, యీ 'నేను' భయాన్ని గురించి ఏమీ చెయ్యలేదని తెలుసుకున్నప్పుడు మాత్రమే భయం నుంచి విముక్తి కలుగుతుంది. "నేను భయపడుతున్నాను, యీ భయాన్ని గురించి ఏదయినా చేయాలి" అని అంటున్న ఆ 'నేను' ను చూడండి. భయాన్ని గురించి అది పనిచేస్తున్నంతకాలమూ నిరోధభావాన్ని కలిగించి, ఆ విధంగా సంఘర్షణను యింకా పెంచుతుంటుంది. మనం కనుక భయం అంటేనే 'నా' అని గుర్తిస్తే అప్పుడు 'నేను' పనిచేయడం మానేస్తుంది. అప్పుడు మాత్రమే భయం తొలగిపోతుంది.

చూడండి, భయంగాని, ఒక బలమైన కాంక్షగాని, సెక్స్ సంబంధమైన వాంఛగాని కలిగినప్పుడు దాని గురించి ఏదో ఒకటి చేయడం మనకు అలవాటై పోయింది. వాంఛ, 'నా' వేరువేరుగా వున్నాయని అనుకుంటూ దాని పై చర్య తీసుకుంటాం.