Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సందేహాలు, సమాధానాలు

87

అనీ, ఏమాత్రం ఆలోచించకూడదు అనీ, ఎరుకగా వుండకూడదనీ, అంతర్గతంగా నిర్దుష్టతతో వుండకూడదనీ మనం కోరుకుంటాం. ఎందుకంటే వారిలో స్పష్టంగా చూసే శక్తి వుంటే గట్టిగా హత్తుకొని పోయిన మన విలువలకు ప్రమాదం వాటిల్లవచ్చు. కాబట్టి యీ సమస్యలోని అసలు అంశం ఏమిటంటే, ఆధ్యాపకుడికి సరియైన విద్య గరపడం ఎట్లా అనేది. మీరూ, నేనూ- ఎందుకంటే బోధించేది తల్లిదండ్రులూ, సమాజమే కాబట్టి- ఏ విధంగా మీరూ, నేను మనలోపల స్పష్టతను సాధించగలుగుతాం అనేది తెలుసుకోవాలి. అప్పుడే పిల్లలు కూడా స్వేచ్ఛగా ఆలోచించగలుగుతారు. అంటే నిశ్చలంగా వుండే మనసు, నెమ్మదిగా వుండే మనసు, దాని ద్వారా నూతనమైన విషయాలను గ్రహించడమూ, సృజించడమూ పిల్లలలో కలుగుతుంది.

ఇది నిజంగానే చాలా ముఖ్యమైన ప్రశ్న. అసలు మనం చదువుకుంటున్నది ఎందుకు? ఉద్యోగం కోసమా? కేథలిక్ మతాన్నో, ప్రొటెస్టెంట్ మతాన్నో స్వీకరించ డానికి, కమ్యునిస్ట్ సిద్ధాంతాలో, హిందూమత సిద్ధాంతాలో ఆమోదించడానికా? ఒక సంప్రదాయాన్ని అనుసరించడానికో, ఒక వుద్యోగంలో సర్దుకొనిపోవడానికోనా? లేదూ చదువు యింతకంటే చాలా భిన్నమైనదా? అది జ్ఞాపకశక్తిని వృద్ధి చేసుకోవడం కాదు, అవగాహన చేసుకొనే ప్రక్రియ. విశ్లేషణ ద్వారా అవగాహన కలగదు. మనసు చాలా నెమ్మదిగా వుండి, బరువు భారాలన్నింటినీ దింపుకొని వున్నప్పుడు మాత్రమే కలుగుతుంది. విజయం సాధించాలనే ఆరాటంతోనూ, భంగపడుతూనూ, ఓటమి అంటే భయపడుతూనూ వున్నప్పుడు కాదు. మనసు నిశ్చలంగా వున్నప్పుడు మాత్రమే అవగాహన కలగడానికి, వివేకం కలగడానికి అవకాశం వుంది. అటువంటిది నేర్పించేదే సవ్యమైన విద్యావిధానం. దీనిద్వారా తక్కినవన్నీ తప్పక సాధ్యపడతాయి.

అయితే మనలో చాలా మందికి దీనిలో ఏమాత్రం ఆసక్తి లేదు. మీకో కొడుకు వుంటే అతడొక వుద్యోగస్తుడవాలి. మీకు కావలసిందల్లా అంతే. అతని భవిష్యత్తు బాగుండాలి. మీకు వున్నవి అన్నీ- మీ ఆస్తిపాస్తులు, మీ విలువలు, నమ్మకాలు, సంప్రదాయాలు- అవన్నీ మీ పిల్లలకు వారసత్వంగా వచ్చి తీరాలా? లేదూ సత్యం అనే దానిని తనంతట తానే కనిపెట్టడానికోసమై ఆతను స్వేచ్ఛగా పెరగాలా? అది జరగాలంటే ముందుగా యీ వారసత్వాలన్నీ మీరు వదులుకోవాలి; తరచి శోధించడానికి, సత్యం ఏది అన్నది కనిపెట్టడానికి మీరు స్వేచ్ఛగా వుండాలి.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, IX వాల్యూమ్,

ఆమ్స్టర్ డామ్, 19 మే 1955